ప్రజాశక్తి -అరకులోయ రూరల్:మండలంలోని చొంపి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని చొంపి పంచాయతీ పీసా కమిటీ కార్యదర్శి, వైసీపీ సీనియర్ కార్యకర్త రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ మేరకు ఆదివారం గ్రామ గిరిజనులతో కలిసి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, చొంపి జంక్షన్ నుండి బస్కి వరకు సుమారు 22 కిలోమీటర్ల రహదారి పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చెరువుల తలపిస్తుందన్నారు. అధికారులు పట్టించుకున్న పరిస్ధితులు లేదన్నారు. ఈ గుండా చొంపి, శిరాగం, బస్కి, మాడగడ, సుంకరమెట్ట, హుకుంపేట మండలం భూర్జ పంచాయతి, వేంగడ పంచాయతీల గిరిజనులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చొంపి రోడ్డు నిర్మాణం చేపట్టి గిరిజనుల రవాణా కష్టాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చొంపి గ్రామస్తులు పెనుమల మోహన్‌రావు, జల్లేడి రంజిత్ కుమార్, మహేష్ పాల్గొన్నారు.
డ్రెయినేజీ నిర్మించాలి
అరకులోయరూరల్:మండలంలోని చొంపి గ్రామం లో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాలని మాజీ సర్పంచ్ గుజ్జెలి మధునాయుడు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, 2001లో గత ప్రభుత్వ హాయంలో కొన్ని వీధుల్లో వేయించిన సీసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తిగా ద్వంసం అయ్యాయని, నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ పూర్తిగా ధ్వంసం కావడంతో వర్షాకాలంలో ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వ ఉండిపోతుండటంతో దుర్వాసన వెదజల్లుతుందని, దోమల బెడద ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందింక పోవడంతో గిరిజనులు సొంతంగా డ్రైనేజీల నిర్మాణం చేసుకుంటు న్నారన్నారు. అధికారులు, పాలకులు స్పందించి చొంపి గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం చేపట్టి గిరిజనుల కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ పీసా కమిటీ కార్యదర్శి సాగర రాజ్ కుమార్, ఏపి టూరిజం ఉద్యోగి పెలుమల మోహన్‌రావు, కార్పెంటర్ రామ్మూర్తి, రైల్వే ఉద్యోగి జల్లేడి రంజిత్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు.










