Sep 28,2023 07:31
  • పార్లమెంటులో మాజీ నాజీ సైనికునికి సత్కారంపై సర్వత్రా విమర్శలు
  • హుంకాను తమకు అప్పగించండన్న పోలండ్‌

ఒట్టావా, వార్సా : తాను తప్పు చేశానని, అందుకే పదవి నుండి తప్పుకుంటున్నానని కెనడా స్పీకర్‌ ఆంథోనీ రోటా మంగళవారం ప్రకటించారు. గత వారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కెనడా పర్యటన సందర్భంగా 98ఏళ్ళ నాజీ మాజీ సైనికుడు యరొస్లావ్‌ హుంకాను గ్యాలరీలో కూర్చోవాల్సిందిగా ఆహ్వానించి పొరపాటు చేసినట్లు ఆయన అంగీకరించారు. పైగా హుంకా వచ్చే సమయంలో ప్రధాని జస్టిన్‌ ట్రూడే సహా కెనడా పార్లమెంట్‌ సభ్యులందరూ రెండుసార్లు లేచి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత హుంకాను యుద్ధ వీరుడిగా ప్రశంసిస్తూ రోటా సమావేశంలో మాట్లాడారు. హుంకా ఉక్రెనియన్‌ నాజీ డివిజన్‌లో భాగమని, అటువంటి వ్యక్తిని పార్లమెంటుకు పిలిచి ఎలా సత్కరిస్తారని పలువురు ప్రశ్నించారు. దీంతో అధ్యక్షుడు ట్రూడో తీవ్ర ఇరకాటంలో పడ్డారు. ఆయనను కాపాడేందుకు స్పీకర్‌ తప్పంతా తన మీద వేసుకున్నారు. నాజీ సైనికుడికి సత్కారం దారుణమైన చర్యగా రష్యా అభివర్ణించింది. కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా గల యూదులందరికీ, ఇతర వ్యక్తులు, కమ్యూనిటీలకు ఈ చర్య చాలా బాధను కలిగించిందని, ఆ విషయం తనకు అర్ధమైందని రోటా చెప్పారు.

  • హుంకాను మాకు అప్పగించండి: పోలండ్‌

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉక్రెనియన్‌ నాజీ డివిజన్‌లో పోషించిన పాత్రపై దర్యాప్తు చేయడానికి గాను యరొస్లావ్‌ హుంకాను తమకు అప్పగించాలని పోలండ్‌ కోరింది.ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కెనడా పార్లమెంట్‌ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, గ్యాలరీలో కూర్చునేందుకు హుంకాను కెనడా పార్లమెంట్‌ స్పీకర్‌ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలెండ్‌ జాతీయులను, యూదులను ఊచకోత కోయడంలో ఈ డివిజన్‌ కీలక పాత్ర పోషించింది. తనకు హుంకా గతం గురించి తెలియదని, అందుకే ఆహ్వానించానని స్పీకర్‌ చెప్పారు. అయినా, ఆగ్రహం చల్లారకపోవడంతో స్పీకర్‌ పదవి నుంచి తప్పుకున్నారు.