Jul 26,2021 08:30

న్యూఢిల్లీ : కెనడాలో 12 ఏళ్ల బాలుడు వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి నాలుక మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోయింది. కడుపునొప్పి, చర్మం రంగు మారడంతో పాటు గొంతునొప్పి, మూత్రం ముదురు ఎరుపు వర్ణంలోకి మారడం వంటి లక్షణాలు ఈ బాలుడిలో కనిపించాయి. దీంతో బాలుడ్ని టరంటోలోని 'హాస్పిటల్‌ ఫర్‌ సిక్‌ చిల్డ్రన్‌'లో చేర్పించారు. పరీక్షలు చేపట్టిన వైద్యులు...రోగ నిరోధక వ్యవస్థ.. స్వీయ ఎర్ర రక్తకణాలపై దాడి చేసి, వాటిని నాశనం చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని తేల్చారు. తొలుత ఈ సమస్యను కామెర్లుగా వైద్యులు భావించారు. దీంతో పలు పరీక్షలు నిర్వహించాక అతడికి రక్తహీనత ఉందని, ఎప్‌స్టెయిన్‌ బార్‌ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిందని గుర్తించారు. అంతిమంగా 'కోల్డ్‌ అగ్లూటినిన్‌' అనే వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఇది చాలా అరుదైన ఆటోఇమ్యూన్‌ రుగ్మత. ఈ వ్యాధి ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ అదుపు తప్పి.. స్వీయ ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తుంది. చలి వాతావరణం కారణంగా ఈ వ్యాధిన బారిన పడుతుంటారు. చికిత్సలో భాగంగా బాలుడికి రక్తమార్పిడి చేశారు. స్టెరాయిడ్లు ఇచ్చారు. 7 వారాల చికిత్స అనంతరం అతడు వేగంగా కోలుకున్నాడని.. నాలుక క్రమంగా సాధారణ రంగులోకి వచ్చేసిందని వైద్యులు తెలిపారు. ఎప్‌స్టెయిన్‌ బార్‌ వైరస్‌ కారణంగా సోకిన ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఆ బాలుడు ఈ వ్యాధి బారినపడి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. కోల్డ్‌ ఆగ్లూటినిన్‌ వల్ల రక్తహీనత తలెత్తుతుందని, ఎర్ర రక్తకణాలు వేగంగా విచ్ఛిన్నమవుతాయని అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పేర్కొంది. దీనివల్ల బైలిరుబిన్‌ పెరిగిపోతుందని, అది అంతిమంగా కామెర్లకు దారితీస్తుందని తెలిపింది.