
జాతీయ పతాకాలతో ఎస్‌ఆర్‌కెఆర్, శ్రీసూర్య విద్యార్థుల ర్యాలీ
ప్రజాశక్తి - భీమవరం రూరల్
చంద్రయాన్ ప్రయోగం విజయవంతమైన సందర్బంగా భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు బుధవారం సాయంత్రం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రాంగణం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ వెళ్లి అక్కడ నుంచి తిరిగి కళాశాలకు వచ్చి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కస్పాండెంట్ ఎస్‌ఆర్‌కె.నిషాంత వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.జగపతిరాజు, డిఎస్‌టి పూర్వపు శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో భారతదేశం అగ్రగామిగా నిలిచిందన్నారు. తమ కళాశాల అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా ఉన్న డాక్టర్ వైవి.కృష్ణమూర్తి కూడా ఇందులో భాగస్వామ్యం కావడం తమ కళాశాలకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కళాశాల కెమిస్ట్రీ హెడ్ పి.భవాని, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎం.గోపాలకృష్ణమూర్తి, పిఎ.రామకృష్ణంరాజు, ఫిజికల్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : చంద్రయాన్ - 3 విజయవంతమైన నేపథ్యంలో శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్య విద్యాసంస్థల అకడమిక్ అడ్వయిజర్ కె.జానకీరామ్ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో భారత్ నిలిచిందన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ఇస్త్రో మరెన్నో విజయాలు సాధించాలన్నారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ మహ్మద్ ఫాజిల్ మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో తక్కువ ఖర్చుతో ఎన్నో ప్రయోగాలను భారతదేశం నిర్వహిస్తోందని తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 'జయహో చంద్రయాన్-3' అంటూ ప్రధాన వీధుల్లో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండంట్ ఘంటసాల బ్రహ్మాజీ, ఉపాధ్యాయులు డి.శ్రీకళ, ఆర్.సతీష్ పాల్గొన్నారు.