ప్రజాశక్తి-సీతమ్మధార : జర్నలిస్టు తులసిచందును చంపుతానని బెదిరింపులు, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులను వ్యతిరేకిస్తూ విదసం ఐక్యవేదిక ఆధ్వర్యాన వివిధ దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ భవన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత నేత బూసి వెంకటరావు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి అండతోనే దేశం నలుమూలలా మనువాదులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమా, తుపాకి రాజ్యమా అని ప్రశ్నించారు. బిజెపి ఏలుబడిలో నచ్చని వారిపై కాషాయ మూకల దాడులు పెరిగాయన్నారు. యుపిలో రౌడీయిజంపై ఉక్కు పాదం అని గొప్పలు చెప్పే సిఎం యోగికి చిత్తశుద్ధి ఉంటే అజాద్‌పై కాల్పుల జరిపి దుండగులను నడి రోడ్డుపై ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్‌చేశారు. అజాద్ ప్రాణానికి ఏదైనా జరిగితే మోడీ పాలనపై దేశ వ్యాప్తంగా అంబేద్కరిస్టుల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జర్నలిస్టు తులసిని వేధిస్తున్న వారిపై కేసిఆర్ సర్కారు కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్.వేమన, సోడదాసి సుధాకర్, పాక సత్యనారాయణ, ప్రొఫెసర్ జాన్, గోలమాల అప్పారావు, నిర్మల, సుజాత, కస్తూరి వెంకటరావు, దుర్గారావు, నూకరాజు, మర్ర చంద్ర శేఖర్, కె.ప్రసాదరావు, జి.రవికుమార్, సుదర్శన్, మధు, రామారావు తదితరులు పాల్గొన్నారు.










