
ప్రజాశక్తి- పిఎం పాలెం: వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా చంద్రంపాలెం జిల్లా పరిషత్ పాఠశాలను పలువురు మంత్రులు, వైసిపి ముఖ్యనేతలు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో మాట్లాడి, పాఠశాలలో సౌకర్యాలపై ప్రశ్నించారు. విద్యాబోధనపై ఆరా తీశారు. పాఠశాలలో నాడునేడు పనులపైనా, విద్యార్థుల సామర్థ్యాలపై హెచ్‌ఎం ఎం రాజాబాబును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు మంత్రి మేరుగు నాగార్జున, సీదిరి అప్పలరాజు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, వరుదు కళ్యాణి, జిల్లా పరిషత్ చైర్మన్ జె సుభద్ర, విశాఖ మేయర్ గోలగాని హరివెంకట కుమారి, నెడ్ క్యాప్ చైర్మెన్ కెకె రాజు, పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, కార్పొరేటర్ ముత్తంశెట్టి లక్ష్మి ప్రియాంక, డిఇఒ ఎల్ చంద్రకళ పాల్గొన్నారు.
అమాత్యుల నిర్వాకంపై విద్యార్థుల నిరాశ
తమ పాఠశాల సందర్శనకు మంత్రుల బృందం వస్తుందన్న ఆనందంలో రాష్ట్రంలోనే అత్యథిక మంది విద్యార్థులున్న చంద్రంపాలెం పాఠశాలలో యాజమాన్యం, విద్యార్థులు ఎంతో శ్రమించి, వినూత్నంగా ఎంతో కష్టమైన 200 దేశాల నాణేలు కరెన్సీ నోట్లతో పిలాటెల్లి ప్రదర్శనను అద్భుతంగా ఏర్పాటు చేశారు. మంత్రులను ప్రదర్శన తిలకించేందుకు ఆహ్వానిస్తూ, ఇరువైపులా క్యూపద్ధతిలో విద్యార్థులు నిలబడ్డారు. అయితే మంత్రులు బృందం అటువైపు కనీసం కన్నెత్తి చూడకుండా వెళ్లిపోవడంపై విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రుల తీరుపై వైసిపి శ్రేణులు కూడా పెదవి విరిచారు. రోజుల తరబడి విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రమించి ప్రదర్శన ఏర్పాటు చేయడంతోపాటు, గంటల తరబడి ఎండలో నిలబడి స్వాగత సన్నాహాలు చేస్తే, ప్రదర్శనను చూసేందుకు కనీసం కనీసం కొద్దినిమిషాలు కేటాయించని వైసిపి నేతలు, మంత్రుల వైఖరిపై లోలోపల మదనపడుతూ, మండిపడుతున్నారు.