గీతను బూర చేసి, వూపిరి వూది, ప్రాణం పోసి
ముఖచిత్రాలుగా అలంకరించడం నిజం
మాట్లాడే బొమ్మల్ని కుంచెతో సృష్టించి
కాకి పడగల్లా కళకళలాడించటం నిజం !
ఏ కథ, ఏ కవిత, ఏ నవల నీ రంగుల మాయలో
ఎంత సోయగపు సొగసులతో రూపుదిద్దుకుందో తెలుసు
నువ్వు గజ్జలు కట్టి ఆడించిన తకదిమి షోలు
నీ వానవిల్లు సింహాసనంపై మెరిసిన షాలు
పాముల్లేని వైకుంఠపాళిలో నువ్వెక్కిన
చిరునవ్వు నిచ్చెనలు తెలుసు
ముఖాముఖిలో నీతో కూచుంటే
అది థౌజండ్ పైపర్స్ నిషానే
బాపు అడుగుల్లో నీవు బాటసారివై నడుస్తుంటే
నీవు గీసిన బొమ్మల్ని పత్రికల్లోంచి దొంగలించి
గుండె లాకర్లలో పదిలంగా దాచుకున్న చిత్రకారులెందరో !
నీ క్రోక్విల్ నిబ్ తాగేసినన్ని రంగుల్ని సష్టిలో
సూర్యాస్తమయ గగనాలూ తాగలేక పోయాయన్న బహిరంగ రహస్యం
తెలంగాణ వైతాళికుల పరివేషంలో పెరిగిన నీలో
వాళ్ళందరి ఆత్మలూ కడదాకా కలిసికట్టుగా వున్నాయన్నది నిజం.
నువ్విక లేవన్నది ఎంత నిజమో
నువ్వు తెలుగు సాహిత్యంలో బతికే ఉంటావన్నది అంతే నిజం !
(చిత్రకారుడు చంద్రకు నివాళిగా)
- ఈతకోట సుబ్బారావు. 9440529785