Oct 17,2023 17:54

డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణకు స్వాగతం పలుకుతున్న ఇఒ తదితరులు

చంద్రఘంట అలంకారంలో అమ్మవారు
- రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు
- మల్లన్నను దర్శించుకున్నడిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ
ప్రజాశక్తి - శ్రీశైలం

    శ్రీశైలంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు రావణవాహనసేవ, అమ్మవారికి శ్రీచక్రార్చన, నవావరణార్చన, విశేష కుంకు మార్చనలు, రుద్రహోమం, చండీహౌమం, చతుర్వేద పారాయణలు, రుద్ర పారాయణ, చండీపారాయణ, జపానుష్ఠానాలు వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తిని చంద్ర ఘంట అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావణ వాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంట అలంకారంలో ఉన్న అమ్మవారిని, రావణ వాహనంపై ఉన్న స్వామి అమ్మవార్లను ఆలయ రాజగోపురం గుండా ప్రధాన వీధుల్లోకి తీసుకువచ్చి రథశాల వద్ద నుండి నంది గుడి, బయలు వీరభద్ర స్వామి వరకు గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో వివిధ రకాల నృత్య ప్రదర్శనలు, కోలాటం, చెక్కభజన, తప్పెట చిందు వంటి కళా నృత్య ప్రదర్శనలు, వేదమంత్రాలు మధ్య గ్రామోత్సవాన్ని చేపట్టారు.
కుమారి పూజ : దసరా మహోత్సవాల్లో సాంప్రదాయబద్దంగా కుమారి పూజ నిర్వహించారు. ఇందులో 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రములు సమర్పించి ప్రత్యేక పూజలు వారికి నిర్వహించారు.
మల్లన్నను దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
శ్రీశేల క్షేత్రంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సోమవారం రాత్రి ఆయన స్వామి అమ్మ వార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. మంగళవారం ఉదయం స్వామి అమ్మ వార్లను దర్శించుకునేందుకు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగానే దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ముందుగా స్వామివారిని, అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.