ప్రజాశక్తి - పెద్దకడబూరు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని కేంద్ర మాజీ మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని తారాపురం గ్రామంలో టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో, టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు అధ్యక్షతన 'భవిష్యత్తుకు గ్యారెంటీ' బస్సు యాత్ర నిర్వహించారు. ఈ బస్సు యాత్ర తారాపురం గ్రామం నుంచి ప్రారంభమై రంగాపురం, చిన్నకడబూరు, పెద్దకడబూరు గ్రామంలో సాగింది. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడారు. జగన్ పాలన అవినీతిమయంగా మారిపోయిందని మండిపడ్డారు. తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించినా ఏనాడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, నిజాయితీగా పరిపాలించామని గుర్తు చేశారు. టిడిపి కార్యకర్తలపై పోలీసుల చేత తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారుపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. టిడిపి మహానాడు వేదికగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన మహిళలకు 'మహాశక్తి', యువగళం, అన్న ధాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ఆరు అంశాల మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులను ప్రారంభించేలా ముఖ్యమంత్రి జగన్‌పై ఒత్తిడి తెచ్చే దమ్ము, ధైర్యం జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎక్కడిదని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లా రైతులకు అంకితం చేసి మాట నిలబెట్టుకుంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా అధ్యక్షులు బిటి.నాయుడు, ఆదోని ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు, పత్తికొండ ఇన్‌ఛార్జీ కెఇ.శ్యాంబాబు, కోడుమూరు ఇన్‌ఛార్జీ ఆకెపోగు ప్రభాకర్, జిల్లా మహిళా అధ్యక్షులు కవిత, ఫుడ్ కమిటీ మాజీ ఛైర్మన్ గుడిసె కృష్ణమ్మ, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, పెద్దకడబూరు మాజీ ఎంపిపి నరవ శశిరేఖ, టిడిపి మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న, మంత్రాలయం మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి పాల్గొన్నారు.
బస్సుయాత్రలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి










