ప్రజాశక్తి ఓబుల దేవర చెరువు : పుంగనూరులో పర్యటిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాము అధికారంలోకి వస్తే వడ్డీతో సహా తీరుస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోనిటిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పై వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని అన్నారు. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, వైసీపీ గూండాలు రాళ్ల దాడికి దిగటం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని చెప్పటానికి నిదర్శనమని అన్నారు. పుంగనూరులో చంద్రబాబుపై, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీ మూకలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈవిషయంలో వైసిపి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఓటమి భయంతోనే వైసిపి ఇలాంటి దాడులకు తెగబడుతుందని, టిడిపి చూస్తూ ఊరుకోదని, దాడికి ప్రతి దాడి తమకు కూడా తెలుసునని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి మండల కన్వీనర్ జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, టిడిపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అంజనప్ప , రాజారెడ్డి, నారపురెడ్డి, అంజన్ రెడ్డి, కంచి సురేష్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.










