Aug 05,2023 22:09

సీతంపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన రాళ్లు దాడికి నిరసనగా జియమ్మవలస మండలం పెదమేరంగి కూడలి వద్ద టిడిపి నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు బహిరంగ సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చంద్రబాబునాయుడుపై రాళ్ల దాడికి పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు. పెద్దిరెడ్డి నీకు సమయం దగ్గర పడిందని, ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దిరెడ్డిని అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి బొంగు సురేష్‌, టిడిపి అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: చంద్రబాబునాయుడు రోడ్‌ షో అడ్డుకొని మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకొని రాళ్లతో చేపట్టిన దాడికి నిరసనగా మండలంలో ఎర్రన్న గుడి జంక్షన్‌లో టిడిపి నాయకులు నిరసన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదని, దాడికి పాల్పడిన మంత్రి పెద్దిరెడ్డిని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, మంత్రి పెద్దిరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. టిడిపి మండల అధ్యక్షుడు అక్కేన మధుసూదన్‌ రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి నాయకులు పురుషోత్తంనాయుడు, ఎం.తవిటినాయుడు, ఎం బి. విజరు అంకుశం, అంబటి తవిటి నాయుడ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు పై దాడి అమానుషం
గుమ్మలక్ష్మీపురం: మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చంద్రబాబు నాయుడుపై దాడి చేయడం అమానుషమని టిడిపి సీనియర్‌ నాయకులు బిడ్డిక పద్మావతి అన్నారు. రాష్ట్రంలో టిడిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇలా దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
సీతంపేటలో కొవ్వొత్తులతో ర్యాలీ
సీతంపేట : పుంగనూరులో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబుపై వైసిపి అల్లరి మూకలు రాళ్లు రువ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాత్రి టిడిపి కార్యకర్తలు సీతంపేట హై స్కూల్‌ నుండి బస్టాండ్‌ వరకు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం చేపట్టారు. చంద్రబాబు పై రాళ్లు దాడి చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పడాలి భూదేవి మాట్లాడుతూ వైసిపి అరాచకాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మయ్య కుంపి బిడ్డిక దమయంతి నాయుడు మాజీ ఎంపిటిసి బి జయలక్ష్మి మూర మోహన్‌ తదితరులు పాల్గొన్నారు..