Aug 05,2023 22:10

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అశోక్‌

* ఎమ్మెల్యే బెందాళం అశోక్‌
ప్రజాశక్తి - కవిటి: 
ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కాన్వారుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కర్రలు, రాళ్లతో దాడి చేయడం అమానుషమని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతోనే వైసిపి నాయకులు దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. టిడిపికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా తాము భయపడమని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టైమ్‌ దగ్గర పడిందని హెచ్చరించారు. పుంగనూరులో జరిగిన విధ్వంసంపై దర్యాప్తు చేసి బాధ్యులపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో టిడిపి నాయకులు బెందాళం రమేష్‌, పిరియా శివాజీ, పిరియా చైతన్య, యోగి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.