Nov 27,2022 22:34

పజాశక్తి-జగ్గయ్యపేట
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వైకాపా నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ శాసన సభ్యులు శ్రీరామ్‌ రాజగోపాల్‌ హితువు పలికారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు వైకాపా నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నాయకులు తప్పుచేసి అందరిపై చిందులు తొక్కుతున్నారని మండి పడ్డారు. చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలతోనే వారి నేర చరిత్ర బయటపడిందని ఆరోపించారు. ప్రభుత్వంపై తప్పులు చూపిస్తూ సోషల్‌ మీడియాలో చిన్న చిన్న కామెంట్‌ పెడితేనే అరెస్టులు చేసి ఇబ్బందులు గురిచేస్తున్న ప్రభుత్వం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని చంపుతామని బెదిరించిన, రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి హత్య రాజకీయాలు జరిగిన అది మొదట లోకేష్‌ తోనే మొదలవుతుందన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి, లోకేష్‌ కి ప్రజల్లో వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎమ్మెల్యే తమ్ముడుపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రానున్న రోజులలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నూకల కుమార్‌ రాజా, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధాకష్ణ, మున్సిపల్‌ కౌన్సిలర్లు పేరం సైదేశ్వరరావు, నకిరికంటి వెంకటి, ఇర్రి నరసింహారావు పాల్గొన్నారు.