Sep 11,2023 00:11

ప్రజాశక్తి -రేపల్లె
టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి, అక్రమాలపై పూర్తి ఆధారాలతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. స్థానిక వైసిపి కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అభ్యంతరాలను పక్కకు నెట్టి క్యాబినెట్ నిర్ణయాలతో సంభంధం లేకుండా సీమెన్స్ సంస్థను తెరపైకి తీసుకువచ్చి భారీ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. రూ.370కోట్ల నిధులు బినామీ పేర్లతో తనయుడు లోకేష్ ఖాతాలోకి మరల్చారనే స్పష్టమైన ఆధారాలతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని చెప్పారు.  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సానుభూతిని తెలపటం దొంగతనం చేసిన వ్యక్తిని సమర్ధించటమే అన్నారు. పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బాలకృష్ణ, భువనేశ్వరి ప్రత్యేక విమానాలలో గన్నవరంలో దిగేంత డబ్బు ఎక్కడ నుండి సమకూరాయని ప్రశ్నించారు. చేసిన అవినీతి నుండి బయట పడేందుకు ఢిల్లీ నుండి అతి ఖరీదైన అడ్వకేట్లను పిలిపించటం ఎందుకని ప్రశ్నించారు. విచారణ సంస్థలను నిజాయితీగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఆనాడు జగన్ ఏం అవినీతి చేశారని అరెస్టు చేశారో చెప్పాలన్నారు. ఆనాడు జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని చూడలేక ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబు, సోనియా, చిదంబరం కాళ్లు పట్టుకొని సిబిఐ ప్రోత్సాహంతో ఆనాడు జగన్ ని అరెస్టు చేయించారని చెప్పారు. ప్రస్తుతం ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారని తెలిపారు. విచారణ అధికారులు ఏమి అడిగినా చంద్రబాబు నాకు ఏమాత్రం గుర్తు లేదని చెప్పటం చట్టాన్ని తప్పుదారి పట్టించడమే అన్నారు. రాజధాని నిర్మాణంలో, టిడ్కో ఇళ్ళనిర్మాణంలో షాపుజీ, పల్లంజీ, ఎల్ అండ్ టి కంపెనీలలో రూ.118కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబుకు సానుభూతి తెలపడానికి వచ్చిన పెద్దలు వాస్తవాలను గమనించాలని కోరారు. చంద్రబాబు అరెస్టుపై సానుభూతి తెలపటం ఆర్ధిక నేరస్తులను ప్రోత్సహించటమేనని అన్నారు.