ప్రజాశక్తి-బాపట్ల: చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి బాపట్ల శాసనసభ్యుడు కోన రఘుపతికి లేదని బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రవర్మ మాట్లాడుతూ దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన నీఛ చరిత్ర వైసీపీ పార్టీదన్నారు. మహానాడులో టీడీపీ మ్యానిఫెస్టో చూసి వైసిపికి వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. వచ్చే దసరాకు విడుదలచేసే మ్యానిఫెస్టో కి.మీ పంచలు తడవడం ఖాయమన్నారు. బాపట్ల ప్రజలు నిన్ను నమ్మి 2సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇక్కడ ఉన్న సహజ వనరులను దోచుకుని సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చేశావా అని నరేంద్రవర్మ ప్రశ్నించారు. ఇసుక మాఫియా, భూ దందాలను ప్రోత్సహిస్తూ మోనార్కుల్లా వ్యవహరిస్తున్న మీ చేష్టలకు మీ పార్టీ నాయకులే భయపడి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. టిడిపి మేనిఫెస్టో మీద పడి ఏడ్వడం కాదు. నిన్ను రెండుసార్లు ఎమ్మెల్యే చేసిన బాపట్ల నియోజకవర్గ ప్రజలకు తాగునీరు, పారిశుధ్యం, ప్రధానంగా దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవడం నీ కనీసం కర్తవ్యం. ముందు అది నిర్వర్తించి ప్రజల్లోకి రావాలన్నారు. చంద్రబాబు వయో భారంతో ఏమి మాట్లాడుతున్నాడో అని వ్యంగ్యంగా మాట్లాడావు, ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రిని మా నాయకుడుతోపాటు తిరుమల కొండకు పాదయాత్రగా రమ్మను. ఎవరు ముందుగా కాలినడకన కొండమీదకు చేరుకుంటారో చూద్దామన్నారు. ఇంకోసారి నీ స్థాయి మరచి చంద్రబాబును విమర్శిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తానికొండ దయా బాబు, గొలపల శ్రీనివాసరావు, ఏపూరి భూపతిరావు, విన్నకోట వీరయ్య నాయుడు, ఇనగంటి గాంధీ, కొల్లూరి వెంకట్రావు, మోదుగుల శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.










