Jan 06,2023 00:20

ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి, టిడిపి కార్యకర్తలు

ప్రజాశక్తి - రంపచోడవరం
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంపై టిడిపి శ్రేణులు గురువారం నిరసన తెలిపాయి. మాజీ ఎమ్మెల్యేలు వంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యాన స్థానిక క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ మూడు రోడ్ల కూడలిలో నిరసన తెలిపారు. రోడ్లపై ర్యాలీలు, రోడ్‌ షోలు, సభలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జిఒ 1ను రద్దు చేయాలని కోరుతూ ఆ జిఒ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌ వారు రూపొందించిన జీవోను నేటి వైసిపి ప్రభుత్వం అమలు చేయడం దారుణమన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సమయంలో నాటి టిడిపి ప్రభుత్వం పూర్తిగా భద్రత కల్పించిందని, నేడు అందుకు విరుద్ధంగా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల టిడిపి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చింతూరు : చంద్రబాబును అడ్డుకోవడంపై మండల కేంద్రంలో టిడిపి ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్‌ వన్‌ పత్రాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇళ్ల చిన్నారెడ్డి, మల్లెల వెంకటేశ్వరరావు, జి.సురేష్‌, శ్రీలం తమ్మయ్య, ఆకోజ్‌ నూకచారి, తుర్రం ముత్తయ్య, శ్రీరామ్మూర్తి రెడ్డి, పొదిలి రామారావు, సాల్మన్‌ రాజు, కట్ట శంకర్‌, తుర్రం బాబురావు, కుంజ బాలకృష్ణ పాల్గొన్నారు.