Sep 11,2023 20:42

ఫొటో : ఉదయగిరి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి

చంద్రబాబునాయుడు అరెస్ట్‌ అమానుషం
ప్రజాశక్తి-మర్రిపాడు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఎన్నడూ జరగని పరిణామాలు జరుగుతున్నాయని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు అమానుషమని ఉదయగిరి ఎంఎల్‌ఎ మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘోరమైన నీచమైన ఆగడాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తూ అవగాహన లేని పరిపాలన చేస్తున్నారన్నారు. స
హాయ సహకారాలు అందించిన వారికే పంగనామాలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేసే క్రూరమైన పనులను రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన చంద్రబాబు నాయుడు మహా శక్తిమంతుడని, ఎటువంటి కారణాలు చూపకుండా ఆయనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరెస్టును ఇచ్ఛాపురం నుండి కుప్పం వరకు అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. పప్పులు బెల్లం పంచడం వల్ల ఓట్లు రావని రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. అధికారం లేనప్పుడు డబ్బులకు పాల్పడిన వ్యక్తులు అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని ఊడ్చి వేశారని విమర్శించారు. ముందు చూపు ఉన్న వ్యక్తిని ఏ కారణం లేకున్నా ఏదో కారణం చూపి అధికారులు లేనిపోని సెక్షన్లు పెట్టి పెద్ద కసరత్తు చేసి రాజమండ్రి జైలుకు పంపడం దారుణమన్నారు. నందమూరి కుటుంబానికి ఒక చరిత్ర ఉందని అలాంటి కుమార్తె మనవడిని చూసి రాష్ట్రంలోని ప్రజలు జాలితో చూస్తూ వైసిపి ప్రభుత్వంపై కోపోద్రిక్తులుగా ఉన్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థను తన చేతిలో పెట్టుకొని ఇలాంటి దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి తలపెట్టిన బంధు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఉడికి పోయి వైసిపి ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థ వైసిపి ప్రభుత్వం చేతిలో ఉంటే 2024లో బాబు చేతిలోకి రాధా మరల ఆయన ముఖ్యమంత్రి అవుతారని మన పరిస్థితి ఏంటో గమనించాలన్నారు.