* వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చట్టంలో లొసుగులతో తప్పించుకుంటున్నారని, ఎప్పటికైనా ఆయన శిక్షార్హుడని వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఐటి నోటీసులు జారీ చేయడం హర్షనీయమన్నారు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు గతంలోనే అతనిపై ఆరోపణలు ఉన్నాయని, ఈ అక్రమాలపై అతని వివరణ సంతృప్తికరంగా లేని కారణంతో ఆదాయపన్ను శాఖ సంతృప్తి చెందక అతనికి నోటీసులు ఇచ్చిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా ఆయన తప్పించుకోవచ్చని అంతిమంగా ధర్మానిదే విజయమన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు ఇంకా బయటికి వస్తూనే ఉంటాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప చేసిన వాడు శిక్షార్హుడన్నారు. చంద్రబాబు తప్పులు తెలుసుకునే ప్రజలు అతన్ని తిరస్కరించారని చెప్పారు.










