ప్రజాశక్తి - సత్తెనపల్లి టౌన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చపలచిత్తం మాటలు మాట్లాడటం మానుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం ఆయన స్థానిక వైసిపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, పవిత్రమైన వారాహి పేరు పెట్టుకున్న వాహనంపై కూర్చొని అభద్దాలు మాట్లాడటం అపచారమని విమర్శించారు. జనసేన పార్టీని పెట్టి టిడిపి అధినేత చంద్రబాబుకు డబ్బింగ్ చెప్పే ఖర్మ ఎందుకని ప్రశ్నించారు. పవన్ చేసే ప్రతి ప్రసంగంలో జగన్ పోవాలి అని నినాదం ఉంటోందని, జగన్ పోతే ఎవరు వస్తారనే విషయాన్నీ ఆయన చెప్పాలని అన్నారు. జగన్ పోతే ప్రజాసంక్షేమ పోతుందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నాని, అందుకే మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని అన్నారు. పోలవరంలో ప్రాజెక్టులో బండ కుంగిన విషయంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందని, అది అంత ప్రమాదకరమైన అంశం కాదని అన్నారు. టిడిపి ఇంచార్జీ కన్నా లక్ష్మీ నారాయణ నిర్వహిస్తున్న బస్సు యాత్ర నాయకులు, కార్యకర్తలు లేక తుస్సు యాత్రగా మారిందని ఎద్దేవ చేశారు. టిడిపిలో చివరిదాకా ఉంటారా? పార్టీ ఫిరాయిస్తారా? అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా పారిపోతారా? అని ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.










