
ప్రజాశక్తి-విజయనగరం టౌన్, గజపతినగరం : చంద్రబాబు నాయుడుకు ఓటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి, మన పిల్లలు భవిష్యత్ కు చేటు అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఉప ముఖ్యమంత్రులు బుడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసిపి నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేద్రంలో శుక్రవారం సాయంత్రం చేరుకుంది. తొలుత గజపతినగరం నాలుగు రోడ్లు జంక్షన్‌లో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం మెంటాడ రోడ్డులో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్శయ్య అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు మాట్లాడారు.
ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ నాలుగేళ్ళ పాలనలో అన్ని సామాజిక వర్గాలకు చేసిన మేలు గురించి వివరించేందుకు సామాజిక సాధికారిత బస్సు యాత్ర చేపట్టామన్నారు. ఐదేళ్ల క్రితం తమకు ఓటు వేస్తే బ్యాంక్ రుణాలు రద్దు చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశామని, రైతులకు రైతు భరోసా కింద రూ.13వేలు ఇచ్చామని తెలిపారు. సచివాలయాల ద్వారా ఎటువంటి అవినీతి లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అందించిన తమ ప్రభుత్వానిదని అన్నారు. విద్యుత్తు బిల్లులు ఒక్క మన రాష్ట్రంలోనే పెరగలేదని, దేశమంతా పెరిగాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు కల్పించామన్నారు. ప్రజా ధనం తినడం వల్లే చంద్రబాబును సిబిఐ అరెస్టుచేసిందన్నారు. విశాఖను రాజధానిని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న విషయం ప్రజలు గ్రహించాలన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మన పిల్లాడి పీక మనమే కోసినట్లనని అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మన జీవితాలు, సామాజిక పరిస్థితులు ఎలా మారాయనేది చూడాలని, జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. పీడిక రాజన్నదొర మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం లో భాగస్వామ్యం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గతంలో ఎప్పుడైనా వెనుకబడిన కులాలను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. బాబు వస్తే జాబ్ అన్నాడు ఇచ్చాడా అని ప్రశ్నించారు. 99 శాతం హామీలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు.
పేదలు అభివృద్ధి జగన్ తోనే సాధ్యం
పేదల అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని సాంఘిక సంక్షేమశాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. 2024లో మరలా మన ముందుకు మోసగాళ్ళు వస్తారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా అందించిన ప్రభుత్వం తమదని అన్నారు.
సభలో ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు శంబంగి చిన అప్పలనాయుడు, కడిబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, బడుకొండ అప్పలనాయుడు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ
విజయనగరం టౌన్ : విజయనగరం చేరుకున్న సామాజిక సాధికార బస్సుయాత్రకు నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ లభించింది. బస్సుయాత్రకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని తన నివాసం వద్ద నుంచి కోలగట్ల జెండా ఊపి ప్రారంభించారు. వందలాది ద్విచక్ర వాహనాలతో బస్సు యాత్రతోపాటు అంబేడ్కర్ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్‌అండ్‌బీ, కలెక్టరేట్ మీదుగా గొట్లాం వరకూ ర్యాలీ సాగింది. జిల్లా పరిషత్తు ఛ్కెర్మన్ మజ్జి శ్రీనివాసరావు, వైసిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సంగంరెడ్డి బంగారునాయుడు, జి.ఈశ్వర్ కౌశిక్, ఇతర యువజన విభాగం నాయకులు, కార్పొరేటర్లు స్వయంగా వాహనాలు నడుపుతూ ర్యాలీలో ముందుకు సాగారు. అనంతరం గొట్లాం నుంచి బస్సు యాత్ర గజపతినగరం బయల్దేరింది.