Oct 06,2023 20:24

సమావేశంలో మాట్లాడుతున్న గణపతినీడి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం కోట :  యువతే ఈ రాష్ట్రానికి భవిత అని టిడిపి నాయకులు గణపతినీడి శ్రీనివాసరావు అన్నారు. ఉత్తరాంధ్ర స్థాయిలో వాయిస్‌ ఆఫ్‌ యూత్‌ పేరిట శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం దిశ దశా నిర్ణయించేది యువతనేని, ఈ రోజు యువత మేల్కొని చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు వంటి విజన్‌ ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఎంత అవసరమో ప్రతీ ఒక్కరిలో చ్కెతన్యం కల్పించాలని అన్నారు. టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో అక్రమంగా చంద్రబాబును అరెస్ట్‌ చేసారని, ఈ విషయాన్ని యావత్‌ రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ విజనరీ నాయకుడికి, ప్రిజనరీ నాయకుడికి ఉన్న తేడాను రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ తెలుసుకున్నారని అన్నారు. జనసేన నాయకులు గురాన అయ్యలు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణలు మాట్లాడుతూ ఒక అవివేకుడిని ముఖ్యమంత్రిని చేస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని అన్నారు. జిల్లా న్యాయవిభాగం అధ్యక్షులు ఉపాధ్యాయుల రవిశంకర్‌, తెలుగు యువత పార్లమెంటరీ అధ్యక్షులు వేమలి చైతన్యబాబు, కార్యదర్శి గొలగాన సురేంద్ర, ఐటిడిపి అధ్యక్షురాలు విమలారాణి, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పతివాడ విద్యాసాగర్‌ నాయుడు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ మాడుగుల భానుప్రకాష్‌, మద్దిల ప్రవీణ్‌ మాట్లాడారు.
కొనసాగుతున్న నిరసనలు
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ కు నిరసన గా శుక్రవారం 24వ రోజుకూడా నిరసనలు కొనసాగాయి. పార్టీ జిల్లా కార్యాలయం అశోక్‌బంగ్లా వద్ద దీక్షలకు అశోక్‌గజపతిరాజు సంఘీభావం తెలిపారు. సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. మరోవైపు నగర వీధుల్లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ 'బాబుతో నేను' ప్లకార్డును యువత ప్రదర్శించారు.