Jul 19,2023 00:05

ప్రజాశక్తి-కోటనందూరు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవ్వడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం డి.పోలవరం, కొత్త కొట్టాం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డి.పోలవరంలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ చంద్రబాబు, ఆయన అనుచరులు దోచుకున్నారని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్‌ తీసుకున్నది కూడా ఆయన అనుచరులేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిధులు సొంత ఎటిఎంగా చంద్రబాబు వినియోగించుకున్నారన్నారు. సిఎం వైఎస్‌.జగన్‌ పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేపట్టడం లేదని అసత్య ప్రసారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అనంతరం కోటనందూరు మండలం కొత్త కొట్టాం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జగనన్న సురక్ష పథకం ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చింతల రమణ, రెడ్డి స్వామి నాయుడు, డి.లక్ష్మి బాబులు, మండల పరిషత్‌ అధ్యక్షులు లగుడు శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ వెలగా వెంకట కృష్ణాజీ, లంక ప్రసాద్‌, చింతకాయల చినబాబు, సుర్ల రాజు, గొర్ల రామచంద్రరావు, నల్లమిల్లి గోవిందు, గర్శింగు దొరబాబు, కో ఆప్షన్‌ సభ్యులు జగటాలకోట సత్తిబాబు పాల్గొన్నారు.