ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ టిడిపి అధినేత చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడంతో జిల్లావ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం మధ్యంతర బెయిలు ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువడినప్పటి నుంచి టిడిపి శ్రేణులు ఆనందంలో తేలిపోయారు. టిడిపి జిల్లా కార్యాలయంలో మిఠాయిలు పంచుకుంటూ, బాణాసంచా పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. జై చంద్రబాబు నినాదాలతో హోరేత్తించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు గడ్డం సుబ్రమణ్యం, రాష్ట్ర నాయకులు ఆదినారాయణ, దేవళ్ల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, నగర మాజీ మేయర్ స్వరూప, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్‌మొద్దీన్, రాష్ట్ర నాయకురాలు శివబాల, జిల్లా అధికార ప్రతినిధులు సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్, తేజశ్విణి, ఆదెన్న తదితరులు హాజరై సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు గడ్డం సుబ్రమణ్యం మాట్లాడుతూ న్యాయవ్యవస్థలపై టిడిపికి ఎంతో నమ్మకం ఉందన్నారు.ని రాదారమైన ఆరోపణలతో జైలులో పెట్టారని తెలిపారు. మధ్యంతర బైలు రావడం శుభపరిణామం అన్నారు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్వాష్ పిటిషన్ తీర్పు కూడా త్వరలోనే రాబోతోందన్నారు. అధినేత విడుదల కావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అక్కడే బాణాసంచా పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు మారుతికుమార్‌గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు డిష్.నాగరాజు, బంగినాగ, అజీజ్, ముక్తియార్, జేయం.బాషా, విజయశ్రీరెడ్డి, జానకి, సూధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గార్లదిన్నెలో సంబరాలు చేసుకుంటున్న టిడిపి నాయకులు










