
ప్రజాశక్తి- విలేకర్ల బృందం
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 52 రోజులపాటు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు మంగళవారం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల కావడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి.
రంపచోడవరం : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదల కావడం పట్ల టిడిపి, జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. రంపచోడవరం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నీ వెంటే మేముంటాం అంటూ నినాదాలు చేశారు. అనంతరం దేవీపట్నం రోడ్డులోని రామాలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు గొర్లె సునీత, అడబాల బాపిరాజు, అనంత మోహన్, సిద్ధ వెంకన్న దొర, చవలం బాపిరాజు, సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
విఆర్.పురం : మండల కేంద్రం రేఖపల్లి ఎన్టీఆర్ జంక్షన్‌లో టిడిపి మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, జెడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి ఆధ్వర్యాన తెలుగు తమ్ముళ్లు టపాసులతో సంబరాలు చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు బురక కన్నారావు, వాళ్ళ వెంకటేశ్వర రెడ్డి, పెందుర్తి సుదర్శన్, ముత్యాల సిద్దు, సవలం రాజేంద్రప్రసాద్, బొర్రా నరేష్, బీరక సూర్య ప్రకాష్ రావు పాల్గొన్నారు.
చింతూరు : మండల కేంద్రంలో తెలుగు తమ్ముళ్లు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక టిడిపి కార్యాలయం నుండి అంబేద్కర్ ఇందిరా, రాజీవ్ సెంటర్ల మీదుగా ర్యాలీ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇళ్ళ చిన్నారెడ్డి, ఓబులనేని రామారావు చౌదరి, రియాజ్, సురేష్ చౌదరి, నరసింహారావు, మల్లెల్లి వెంకటేశ్వరరావు, మంగ వేణి పాల్గొన్నారు.
అడ్డతీగల : చంద్రబాబు విడుదలతో న్యాయమే గెలిచిందని టిడిపి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో టిడిపి పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. అనంతరం దేవి గుడి సెంటర్ వద్ద బాణసంచా పేల్చి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జర్తా వెంకటరమణ, ఎడ్ల శ్రీనివాస్, తీగల ప్రభ, కామన్ కృష్ణమూర్తి, బటాని వరలక్ష్మి పాల్గొన్నారు.
కొయ్యూరు : చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై మండలంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎ.చిరంజీవి, మేడిపోయిన చిన్న తదితరులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేశారు.
డుంబ్రిగుడ : టిడిపి అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి కే.సుబ్బారావు, టిఎన్‌టియుసి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి, మాజీ ఎంపీపీ దాన్నిరావు, భాస్కరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చింతపల్లి : చంద్రబాబునాయుడుకు మధ్యంతర బెయిల్ రావడం న్యాయానికి సంకేతమని ఆ పార్టీ అరకు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు బాణాసంచా వెలిగించి, స్వీట్లు పంచారు. పాత బస్టాండు నుండి హనుమాన్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అహంకార పూరిత జగనాసురుడికి రాబోవు సార్వత్రిక ఎన్నికలలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, పెదిరెడ్ల బేతాళుడు, లక్కోజు నాగభూషణం, వీరబాబు పాల్గొన్నారు.
అరకులోయ :చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల కావడంతో నియోజకవర్గ కేంద్రమైన అరకులోయలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మంగళవారం రాత్రి రోడ్లపైకి తరలివచ్చి సంబరాలు నిర్వహించుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సియ్యారి దొన్నుదొర, పెద్దలబుడు మేజర్ పంచాయతి సర్పంచ్ పెట్టేలి దాసు బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంప్రదాయ దింసా నత్యంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగరాజు, చందు, విజయనిర్మల,బీబీ లక్ష్మి, జగన్,త్రినాధ్ తదితరులుపాల్గొన్నారు.