Nov 27,2022 21:18

మూడురోజుల పాటు ఉమ్మడి జిల్లాలో పర్యటన
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఈ నెల 30 నుంచి డిసెంబర్‌ రెండో తేదీ వరకూ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఆదివారం టిడిపి నేతలు విడుదల చేశారు. 30వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటలకు కలపర్రు టోల్‌గేట్‌ వద్ద నుంచి బైక్‌ర్యాలీగా బయలుదేరతారు. 11.30 గంటలకు పెదవేగి మండలం విజయరాయిలో బహిరంగ సభ జరగనుంది. మూడు గంటలకు వలసపల్లి క్రాస్‌రోడ్‌, ధర్మాజీగూడెం, మట్టమ్మగూడెం, లింగపాలెంలో మాట్లాడనున్నారు. ఆరు గంటలకు చింతలపూడిలో రోడ్‌షో సాగనుంది. ఏడు గంటలకు బోసుబొమ్మ సెంటర్‌లో బహిరంగ సభ జరగనుంది. రాత్రికి నరసన్నపాలెంలోని దండమూడి రామకృష్ణ ఫంక్షన్‌ హాల్‌లో బస చేయనున్నారు. డిసెంబర్‌ ఒకటో తేదీ 10.30 గంటల వరకూ బిసిలతో సమావేశం కానున్నారు. మూడు గంటలకు పోలవరంలో బహిరంగ సభ జరగనుంది. అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు మెరకవీధి విజయవిహార్‌ సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసంగించి రాత్రికి సుందరసాయి నిగమమ్‌ ఫంక్షన్‌హాల్‌లో బస చేయనున్నారు. రెండో తేదీన మూడు గంటలకు నిడదవోలు గణేష్‌చౌక్‌లో బహిరంగ సభ జరగనుంది. అనంతరం పర్యటన కొనసాగనుంది. మధ్యలో వరిరైతులతో సమావేశం కానున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు తాడేపల్లిగూడెం శేషమహల్‌ సెంటర్‌లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్లనున్నారు.