Apr 24,2023 23:22

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మంగళ, బుధ, గురువారాల్లో గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఉండవల్లి నుంచి వైకుంటపురం వరకు రోడ్డు మార్గంలో వస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అమరావతిలో రోడ్‌ షో నిర్వహిస్తారు. 8 గంటల నుంచి 9 గంటల వరకు డొంకల జంక్షన్‌ రోడ్డులోని జైల్‌సింగ్‌ నగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రికి అమరావతిలోనే బస చేస్తారు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతి నుంచి రోడ్‌ షోగా సత్తెనపల్లి వెళతారు. రాత్రి 7.15 గంటల నుంచి 8.45 గంటల వరకు సత్తెనపల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం శ్రీవెంకటేశ్వర గ్రాండ్‌ ఫంక్షన్‌ హాల్‌లో బస చేస్తారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సత్తెనపల్లిలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మేడికొండూరు చేరుకుంటారు. ఆరున్నర గంటల వరకు మేడికొండూరులో పర్యటిస్తారు. ఆరున్నర గంటల నుంచి 8 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు ఉండవల్లికి చేరుకుంటారు. ఇదిలా ఉండగా చంద్రబాబు పర్యటన సందర్భంగా పలు ప్రాంతాల్లో టిడిపి శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. కొన్నిచోట్ల పోటాపోటీగా వైసిపి నాయకులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాల్లో రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి.