ప్రజాశక్తి - చిలకలూరిపేట : సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పాఠాలు చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రజలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఎద్దేవ చేశారు. రూ.30 కోట్లతో చిలకలూరిపేట పట్టణంలో నిర్మించిన ఆస్పత్రిని గురువారం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ అత్యాధునిక హంగులతో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం ఈ ప్రాంత ప్రజలకు వరమని చెప్పారు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలను ఒంటి చేత్తో గెలిపించుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యేగా అయినా గెలవలేని లోకేష్‌కు లేదన్నారు. రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అరకొరగానే ఇచ్చారని విమర్శించారు. డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా చేయలేదన్నారు. 600 హామీలిచ్చిన టిడిపి వేటీనీ సరిగా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. జగన్ 11 మంది బీసీలను మంత్రులుగా చేశారని, నలుగుర్ని రాజ్యసభకు పంపారని, టిడిపి అధికారంలో ఉండగా ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.










