ప్రజాశక్తి - రేపల్లె
టిడిపి అధినేత చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసుతో అక్రమ అరెస్టు చేశారని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. బాబుతో నేను పేరుతో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో 4వరోజు నిజాంపట్నం మండలం టిడిపి నాయకులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా రెండున్నర లక్షల మందికి శిక్షణ ఇచ్చారని అన్నారు. వారిలో 80వేల మంది యువత మెరుగైన ఉద్యోగాలు పొందారని వివరించారు. జగన్ రెడ్డి వచ్చాక స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకుండా చేసి చంద్రబాబుపై కక్ష సాధింపులకు దిగడం దుర్మార్గమని అన్నారు. ఇప్పుడు జగన్ అవినీతి జరిగిందంటున్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలనే గతంలో విశాఖ వేధికగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో తమ ఆస్తిగా చూపించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. అంతకు ముందు స్కిల్ డెవలప్మెంట్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని, అది తమ ఘనతే అన్నట్లు భారీ ప్రకటనలు ఇచ్చుకున్నారని అన్నారు. అప్పుడు అవినీతి కనిపించలేదని ప్రశ్నించారు. జగన్ అంత అవినీతి పరులు దేశంలో మరెవ్వరూ లేరని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అనగాని శివప్రసాద్, పంతాని మురళీధరరావు, జీవి నాగేశ్వరరావు, వెనిగళ్ళ సుబ్రహ్మణ్యం, ధర్మతేజ పాల్గొన్నారు.










