చంద్రబాబు కేసుపై
స్పందించాల్సిన అవసరం లేదు
స్పీకర్ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి- తిరుమల: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టుపై స్పందించాల్సిన అవసరం లేదంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చగా మారింది. తిరుమల శ్రీవారిని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుని ప్రజలందరూ చూశారని, టీడీపీ సభ్యుల ప్రవర్తనను మీడియా సమర్థిస్తుందా? అని ఎదురు ప్రశ్నించారు. శతిమించిన వ్యవహారాన్ని ప్రజలు క్షమించరని సీతారాం అన్నారు. గతంలో ఎందరో ప్రతిపక్ష సభ్యులు.. అసెంబ్లీలో ఎంతో గౌరవప్రదంగా వ్యవహారించారని, ప్రతిపక్ష సభ్యులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వానికి నరాలు తెగిపోయేవని అన్నారు. రాజకీయాలు చౌకబారు అయ్యాయాంటూ మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ఎందరో రాజకీయ నాయకులని గతంలో అరెస్ట్ చేశారని తమ్మినేని సీతారాం అన్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారని ఉదాహరణగా తెలిపారు.










