Nov 04,2022 23:42

  • సెక్యురిటీ ఆఫీసర్‌కు గాయం
  • నందిగామ, జగ్గయ్యపేట నియోజవర్గాల్లో చంద్రబాబు రోడ్‌ షో

ప్రజాశక్తి-నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిపై శుక్రవారం రాత్రి ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ రైతుపేట సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి వెనుక నుండి పూలు చల్లుతూ రాయి విసరడంతో సెక్యూరిటీ ఆఫీసర్‌ మధుకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసిపి కార్యకర్తల అరాచాకాలకు, విధ్వంసాలకు టిడిపి భయపడదని, టిడిపిని ధైర్యంగా ఎదుర్కోలేక కొంతమంది పిరికిపందలు ఇటువంటి చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖులు చేసే దాడులను టిడిపి తిప్పి కొడుతుందన్నారు. రాయితో దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.
రోడ్‌ షోకు స్వాగతం
కృష్ణాజిల్లా నందిగామ, జగ్గయ్యపేటల్లో నియోజకవార్గల్లో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు రోడ్డు షో నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయనకు విజయవాడ, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేటల్లో ఘన స్వాగతం లభించింది. నందిగామ రైతుపేట సెంటర్లో గజమాలతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులిచ్చారు. అలాగే కంచికచర్ల మండలం పరిటాల వద్ద మాజీ ఎంఎల్‌ఎ తంగిరాల సౌమ్య అధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ చంద్రబాబు కారులోనుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. 'జై చంద్రబాబు... కాబోయే ముఖ్యమంత్రి చందబ్రాబు' కార్యకర్తలు నినాదాలు చేస్తూ పూలవర్షం కూరిపించారు. రెండు నిమిషాలపాటు రోడ్డుపై నిలిచిన చంద్రబాబు కాన్వారు తర్వాత ముందుకు సాగింది. కంచికచర్ల మండలం పేరకలపాడు అడ్డరోడ్డు, కీసర గ్రామాల్లోనూ ఆయనకు స్వాగతం లభించింది. చంద్రబాబు వెంట మాజీమాంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు.