Jul 08,2023 21:13

వినతి అందజేస్తున్న గిరిజన సంఘాల నాయకులు

ప్రజాశక్తి-సాలూరు : టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మూటలేనని డిప్యూటీ సిఎం రాజన్నదొర వ్యాఖ్యానించారు. శనివారం వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా బోసుబొమ్మ జంక్షన్‌లో ఆయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలన స్వర్ణయుగమని అన్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదల గుండెల్లో నిలిచిపోయాయని చెప్పారు. ఆయన బాటలోనే సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. నవరత్నాలనే పథకాల ద్వారా నేరుగా పేదలకు లబ్ధి చేకూరుస్తున్నారని చెప్పారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి కల్లబొల్లి హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి దగా చేసిందన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త కొత్త హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్లోకి వస్తున్నారని చెప్పారు. మహిళలందరికీ ఏడాది 20వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తానని చెపుతున్న చంద్రబాబు హామీ ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. ఐదేళ్లలో మహిళలకు 14 వేల కోట్లు, రైతులకు 87 వేల కోట్లు రుణమాఫీ చేయలేని చంద్రబాబు ఏటా లక్షల కోట్ల రూపాయలు పంచుతామంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. టిడిపి నాయకులు బస్సుయాత్ర పేరుతో పట్టణానికి వచ్చి కల్లబొల్లి కబుర్లు చెపుతారని, నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్లు గిరి రఘు, గొర్లి వెంకటరమణ, పప్పల లక్ష్మణరావు, రాపాక మాధవరావు, పట్టణ మాజీ అధ్యక్షుడు జర్జాపు సూరిబాబు, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, డిసిఎంఎస్‌ డైరెక్టర్‌ పిరిడి రామకృష్ణ, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, వైసిపి సీనియర్‌ నాయకులు దండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సిబ్బంది నియమించాలి
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సిబ్బందిని తిరిగి నియమించాలని గిరిజన సంఘాల నాయకులు శనివారం డిప్యూటీ సిఎం రాజన్నదొరని కోరారు. డిప్యూటీ సిఎం రాజన్నదొరని ఆయన నివాసంలో వారు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో సిఆర్‌టిలను నియమించాలని కోరారు. దినసరి వేతనదారులను రెగ్యులర్‌ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు దుక్క సీతారాం, పల్లా సురేష్‌, ఆర్ధిక చంద్రశేఖర్‌, సంగంరెడ్డి జయసింహ, కోలక గౌరమ్మ ఉన్నారు.