Aug 20,2023 22:32

సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అప్పలరాజు

* పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
ప్రజాశక్తి- పలాస : 
ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, రానున్న ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వస్తే పథకాలన్నీ నిలిచిపోతాయని మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పెసరపాడు, అంతరకుడ్డలో ఆదివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అడిగి తెలుసుకుని అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హామీలన్నీ ఒక బూటకమని, ఎవరూ నమ్మి మోసపోగొద్దని హితవు పలికారు. సంక్రాంతి కానుకగా అవ్వా, తాతలకు జనవరి నెల నుంచి రూ.3 వేలు చొప్పున పింఛను ఇస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల ముందే కాశిబుగ్గ రైల్వే వంతెన పూర్తి చేస్తామన్నారు. కెటి రోడ్డు విస్తరణ పనులు, కిడ్నీ ఆస్పత్రి, ఇంటింటికీ తాగునీరు, డిగ్రీ కళాశాల తన హయాంలో మంజూరయ్యాయని అన్నారు. త్వరలో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రూ.70 లక్షల వ్యయంతో పెసరపాడు, అంతరకుడ్డ రోడ్లు పూర్తి చేశామని చెప్పారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు హనుమంతు వెంకటరావు దొర, పలాస-మున్సిపల్‌ చైర్మన్‌ బల్ల గిరిబాబు, పలాస ఎఎంసి చైర్మన్‌ పి.వి.సతీష్‌, పలాస ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ డబ్బీర్‌ భవానీశంకర్‌, కమిషనర్‌ టి.నాగేంద్రబాబు, వైఎస్‌ చైర్మన్లు మీసాల సురేష్‌ బాబు, బోర కృష్ణారావు, కో-ఆప్షన్‌ సభ్యులు రోణంకి శ్రీనివాసరావు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కోత పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.