
వైఎస్‌ఆర్ వాహన మిత్ర పంపిణీలో డిప్యూటీ సిఎం కొట్టు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు వందలు, వేల కోట్లు దోచుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కొన్ని లక్షల కోట్ల రూపాయలు పలు సంక్షేమ పథకాల రూపంలో పంచుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. శుక్రవారం జరిగిన వైఎస్‌ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక హౌసింగ్ బోర్డు ఎస్‌విఆర్ సర్కిల్ వద్ద తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ డిఎస్‌ఎస్.నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆటో డ్రైవర్ల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి రాగానే వారికోసం వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఆటో కార్మికులు ప్రతిరోజూ ఆటో నడపడం ద్వారా వచ్చే అరకొర ఆదాయం వారి కుటుంబాల పోషణకే సరిపోతుందని తెలిపారు. వారికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి వాహనమిత్ర పథకం ద్వారా ప్రతి సంవత్సరమూ రూ.పది వేల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారన్నారు. దీనివల్ల ఆటో కార్మికుల కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయన్నారు. 2019కి ముందు ఈ డబ్బంతా ఏమైపోయిందనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. టిడిపి అధికారంలో ఉండగా చంద్రబాబు తనకు కావాల్సిన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చేవారని విమర్శించారు. అనేక కుంభకోణాలకు పాల్పడి కొన్ని వందల, వేల కోట్లు దోచుకుని దాచుకున్నారని విమర్శించారు. టిడిపి పాలనకు, వైసిపి పాలనకు తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. అనంతరం వైఎస్‌ఆర్ వాహన మిత్ర లబ్ధిదారులకు రూ.కోటీ 28 లక్షల 40 వేల చెక్కును అందజేసి, జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ హౌసింగ్ బోర్డు ఎస్‌విఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఆటోలు, చిన్న కార్లు ర్యా,లీ తాడేపల్లిగూడెంలోని ప్రధాన రహదారి మీదుగా పెంటపాడు వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కర్రి భాస్కరరావు, మాజీ జెడ్‌పిటిసి ముప్పిడి సంపత్‌కుమార్, వైసిపి యువజన నాయకులు కొట్టు విశాల్, ఆర్‌టిఒ ఎఒ కెఆర్‌కె.వర్మ పాల్గొన్నారు.
భీమవరం : ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ప్రారంభించి అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వైఎస్‌ఆర్ వాహన మిత్ర ఐదో విడత సాయం పంపిణీ చేశారు. జిల్లాలో 8,568 మందికి రూ.8.57 కోట్ల మాన్యువల్ చెక్కును జెసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి ట్రాన్స్‌పోర్టు అధికారి కె.సంజరుకుమార్, డిఎల్‌డిఒ కెసిహెచ్ అప్పారావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టరు కానాల సంగీత్ మాధుర్ పాల్గొన్నారు.