Sep 10,2023 00:13

ఆందోళన చేస్తున్న మత్స్యకారులు

ప్రజాశక్తి-యంత్రాంగం
మాజీ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు అరెస్టును ఖండిస్తూ విశాఖ. అనకాపల్లి జిల్లాల్లోని టిడిపి శ్రేణులు శనివారం నిరసనలు తెలిపాయి. ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని నినాదాలు చేశారు.
పద్మనాభం : పద్మనాభం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ధర్నా చేశారు. బస్సులు, వాహనాలను నిలిపివేశారు. జెడ్‌పిటిసి మాజీ సభ్యులు కె.దామోదరరావు, పార్టీ మండల అధ్యక్షులు కోరాడ రమణ, యూత్‌ అధ్యక్షులు సుమంత్‌నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.లీలావతి, ఎం.నందీశ్వరరావు, ఆర్‌ఎఎన్‌.మూర్తి, ఈగల శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
తగరపువలస : తగరపువలస వై.జంక్షన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వానపల్లి సత్య, జోగ సన్యాసిరావు పాల్గొన్నారు. భీమిలి రోడ్డు పాత ఆంధ్రా బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద టైర్లు కాల్చి నిరసన తెలిపారు. పార్టీ యువ నాయకులు గరే సదానంద, మాజీ కౌన్సిలర్‌ ఎంవి.గురుమూర్తి పాల్గొన్నారు. నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. భీమిలి గంట స్తంభం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలిరాజు, పోతురాజు పాల్గొన్నారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగిన పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తే అరెస్టు చేస్తామని సిఐ రమేష్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాసి త్రినాధ్‌ కుమార్‌, వర్మ, సత్య, చిన్నయ్య, ఎస్‌.ప్రకాష్‌ పాల్గొన్నారు. 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి కోరాడ రాజబాబును నగర పోలీసులు విశాఖలోని అతని నివాసం వద్ద హౌస్‌ అరెస్టుచేశారు.
మధురవాడ : జివిఎంసి 5, 6, 7, 8 వార్డులకు చెందిన టిడిపి నాయకులను ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేసి పిఎం.పాలెం స్టేషన్‌కు తరలించారు. మరి కొంతమందిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నాగోతి సూర్యప్రకాష్‌ ఆధ్వర్యాన మధురవాడ కూడలి వద్ద జాతీయ రహదారిపై నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టుచేశారు.
పెందుర్తి : పెందుర్తి కూడలిలో టిడిపి నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అప్పలనాయుడు, మడక పార్వతి పాల్గొన్నారు.
సీతమ్మధార : 26వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్‌ ముక్కా కిషోర్‌కుమార్‌ను, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఇన్‌ఛార్జి గంటా విజరు, తదితరులను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేసి సిపి ఆఫీస్‌కు తరలించారు. ఈ అరెస్టులను ఖండిస్తూ 26వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద పెడ్డా లక్ష్మణ్‌ ఆధ్వర్యాన నిరసన తెలిపారు.
ఆరిలోవ : ఆరిలోవ టిడిపి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున బిఆర్‌టిఎస్‌, పెదగదిలి కూడలిలో ఆందోళన, నిరసన, ధర్నాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొంతసేపు బిఆర్‌టిఎస్‌ రోడ్డును దిగ్బంధం చేశారు. పోలీసులు 21 మందిని అదుపులోకి తీసుకొని ఆరిలోవ పోలీస్టేషన్‌కు తరలించారు.
గాజువాక : జివిఎంసి 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పులి రమణారెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ముసిరి శ్రీనివాసరావును ముందస్తు అరెస్ట్‌ చేశారు.
సింహాచలం: జివిఎంసి 98వ వార్డు పరిధి సింహాచలం పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్‌ పీవీ నరసింహంతోపాటు పలువురు నాయకులు అరెస్ట్‌ చేశారు. అడవివరంలో పివి ఆధ్వర్యాన, కుమ్మరిదిబ్బ ప్రాంతంలో తెలుగు యువత అధికార ప్రతినిధి సతివాడ శంకర్రావు ఆధ్వర్యాన రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో పంచదార శ్రీనివాసరావు, సిరిపురపు సురేష్‌, భోగపురపు పైడికొండ, రమణ, లండ శ్రీను పాల్గొన్నారు.
గోపాలపట్నం : పశ్చిమ ఎమ్మెల్యే గణబాబును శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆయన స్వగృహంలో అదుపులోకి తీసుకొని ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసులు గోపాలపట్నంలో ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేసి తెలుగుదేశం నాయకులను, కార్యకర్తలను ముందస్తుగానే గృహ నిర్బంధంలో ఉంచారు. మరి కొంత మందిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
ఆనందపురం: చంద్రబాబు అరెస్ట్‌ రాజ్యాంగ విరుద్ధమని వేములవలస ఉపసర్పంచ్‌ కోరాడ నవీన్‌ జ్ఞానేశ్వర్‌ ఖండించారు. మేధావులు, రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గంభీరం మాజీ సర్పంచ్‌ వానపల్లి ముత్యాలరావు, ఈశ్వరరావు, మాజీ వైస్‌ ఎంపీపీ మీసాల సత్యనారాయణను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆనందపురం కూడలిలో నిరసన తెలపడానికి వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
విశాఖ కలెక్టరేట్‌ : జగన్‌ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని టిడిపి మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్‌రావు అన్నారు. శనివారం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటువంటి నీతిమాలిన చర్య ఒక్క జగన్మోహన్‌ రెడ్డికే చెందుతుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జగన్‌ ఒక స్క్రిప్ట్‌ ఇచ్చి లండన్‌కు వెళ్లారన్నారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి నజీర్‌, లీగల్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ కెవి.స్వామి, పార్టీ నాయకులు పిఎస్‌.నాయుడు, బోగి రమణ, వెన్నెల ఈశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని తెలుగు శక్తి అధ్యక్షులు బివి.రామ్‌ అన్నారు.
నర్సీపట్నం టౌన్‌:మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపద్యంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఇంట్లో నుండి ఎవరిని బయటికి రానీకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కౌన్సిలర్లు శ్రీకాంత్‌, దనిమిరెడ్డి మధు, పైల గోవిందు తదితరులను కోటవురట్ల, ఎస్‌ రాయవరం స్టేషన్లకు తరలించినట్లు తెలిసింది. జడ్పిటిసి శుకల రమణమ్మను ధర్మసాగరంలో గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై మున్సిపల్‌ కౌన్సిలర్‌ మాజీ మంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి మీడియాతో భావోద్వేగంగా మాట్లాడారు.
నక్కపల్లి: నక్కపల్లిలో తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్‌ ను అదుపులోకి తీసుకునేందుకు ఉదయాన్నే సీఐ అప్పన్న ,ఎస్‌ఐ శిరీష పోలీస్‌ సిబ్బందితో వెంకటేష్‌ ఇంటికి వెళ్లారు.వెంకటేష్‌ ను అరెస్ట్‌ చేసి నర్సీపట్నం పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.ఉపమాకలో కొప్పిశెట్టి బుజ్జి ను గృహనిర్బంధం చేసి , కోటవురట్ల పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పాయకరావుపేటకు చెందిన పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, నాయకులు విలియం కేరి, జి.నాగరాజు, పి.పండు, గిరిధర్‌ లను పాయకరావుపేటలో అరెస్టు చేసి నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకువచ్చారు. నక్కపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కోటవురట్ల:చంద్రబాబునాయుడు అరెస్టు నేపథ్యంలో మండలం టిడిపి అధ్యక్షులు జానకి శ్రీను, ఎంపీటీసీ సభ్యులు పి.సూర్యారావు, సహా పలువురు టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. బికే పల్లి గ్రామంలో జగన్మోహన్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టిడిపి కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కార్యదర్శి, బికేపల్లి సర్పంచ్‌ లింగన్న నాయుడు, కొడవటిపూడి ఎంపీటీసీ సూర్య ప్రకాష్‌, జానకి హరి, కసిరెద్ది యేసు పాల్గొన్నారు.
యస్‌.రాయవరం:మండలంలో టీడీపీ నాయకులను పలు చోట్ల పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. మండలం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం, మాజీ మండలం పార్టీ అధ్యక్షులు నలపరాజు వెంకటపతి రాజు, గుర్రం రామకృష్ణ తదితరులు పోలీసులు అరెస్ట్‌ చేసి కోటవుట్ల పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. రాయవరంలో మాజీ సర్పంచ్‌, టిడిపి సీనియర్‌ నాయకులు కందులు వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొత్తపోలవరం ఎన్టీఆర్‌ విగ్రహం ఎదుట కార్యకర్తలు నిరసన చేపట్టారు.
చీడికాడ: మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీ మాజీ జడ్పిటిసి, సర్పంచులు రోడ్లపై బైఠాయించి సీఎం డౌన్‌ డౌన్‌, చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని నిరసన చేపట్టారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్‌ తరలించి పూచికతలపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పి చిన్నంనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి సన్యాసినాయుడు, మాజీ జెడ్పిటిసి పి.రమణమ్మ మాజీ ఎంపీపీ కే కళావతి, ఎంపీటీసీలు కోటి, ముత్యాల నాయుడు, సర్పంచ్‌ కే సూరి నాయుడు పాల్గొన్నారు
ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు
అనకాపల్లి : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా భావిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ద నాగ జగదీశ్వరరావు పేర్కొన్నారు. టిడిపి నాయకుల ముందస్తు అరెస్టుల్లో భాగంగా పట్టణ సీఐ మోహన్‌ రావు ఆధ్వర్యంలో పోలీసులు నాగజగదీష్‌ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు అరెస్టుపై పట్టణంలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం నుండి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌ వరకు టిడిపి శ్రేణులు ప్రదర్శన చేసి, అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు.టిడిపి నాయకులు బిఎస్‌ఎంకే జోగినాయుడు, కొణతాల శ్రీనివాసరావు, బొద్దపు ప్రసాద్‌, పోలారపు త్రినాధ్‌ పాల్గొన్నారు.
కశింకోట : టిడిపి మండల నాయకులు కాయల మురళి, వేగి గోపికృష్ణ, సిద్దిరెడ్డి సూర్యనారాయణ, ఒమ్మి సత్యనారాయణ, వేగి వెంకటరావులను పోలీసులు అరెస్టు చేశారు. పల్లపు సోమవారంలో గొంతుని శ్రీనివాసరావుని, పరవాడపాలెంలో రమణమూర్తిని హౌస్‌ అరెస్టు చేశారు. తాళ్ళపాలెం జంక్షన్‌లో నైనంశెట్టి రమణరావు, ఉల్లింగల రమేష్‌, జెర్రిపోతుల నూకి నాయుడు ఆధ్వర్యాన నిరసన తెలిపారు.
దేవరాపల్లి : మండలంలోని కాశీపురం, రైవాడ, దేవరాపల్లి నాలుగు రోడ్లు కూడలిలో టిడిపి శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాయి. కాశీపురంలో ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఎఎస్‌ఐ మల్లికార్జునరావు ఆధ్వర్యాన అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. టిడిపి నేతలు చిటిమిరెడ్డి సూర్యనారాయణ, సోమిరెడ్డి గోవింద, గంధం జగన్నాథం, చల్ల నానాజీ పాల్గొన్నారు.
కె.కోటపాడు : మండలంలోని కింతాడ శివారు కోండ్రపు వారి పాలెం, చౌడువాడ, గొండుపాలెం, సూదివలస, సంతపాలెం గ్రామాల్లో కార్యకర్తలు రోడ్లపై నిరసనలు చేపట్టారు. కల్లూరు సూర్యనారాయణ, కసిరెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. కె.కోటపాడు మూడు రోడ్ల జంక్షన్లో నిరసన చేపట్టిన టిడిపి నియోజకవర్గం నాయకులు పైలా ప్రసాదరావును అరెస్టు చేసి కసింకోట పోలీసు స్టేషన్‌కు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడును పరవాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
బుచ్చయ్యపేట : మండలంలోని పలు గ్రామాల్లో టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. అనకాపల్లిలో అరెస్టు చేసిన టిడిపి జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు, నాయకులు మల్ల సురేంద్ర, సబ్బవరపు గణేష్‌ను బుచ్చయ్యపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ నాగ జగదీష్‌ అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వడ్డాది : టిడిపి చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్తుల తాతయ్యబాబును శనివారం వడ్డాదిలో ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దొండా నరేష్‌ ఆధ్వర్యాన వడ్డాది నాలుగు రోడ్ల కూడలిలో టిడిపి కార్యకర్తలు మానవహారం చేపట్టారు. పొట్టిదొరపాలెంలో ర్యాలీ నిర్వహించారు.
చోడవరం: చోడవరం మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజు, తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లు నాయుడును చోడవరంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి కె.కోటపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వెళ్లి వారిని పరామర్శించారు. పరవాడ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని చోడవరం స్టేషన్‌లో నిర్బంధించారు.
అచ్యుతాపురం : అచ్చుతాపురం జంక్షన్‌లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రాజాన రమేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు అడ్డుకోగా, తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎస్‌ఐ సన్యాసినాయుడు ఆధ్వర్యాన రాజాన రమేష్‌ కుమార్‌, డ్రీమ్స్‌ నాయుడు, గొర్రె శ్రీనివాస్‌ యాదవ్‌, తమరాల తాతబాబు తదితరులను అరెస్టు చేశారు. పూడిమడకలో మెరుగు బాపునాయుడును ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
యలమంచిలి : టిడిపి నాయకులు, కార్యకర్తలు స్థానిక టిడిపి కార్యాలయం వద్ద మెయిన్‌ రోడ్డుపై బైఠాయించారు. టౌన్‌ ఎస్‌ఐ పాపినాయుడు ఆధ్వర్యాన మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నాయకులు ఎ.రమణబాబు, బొద్దపు శ్రీనివాసరావు, సురకాసుల రమణబాబును అరెస్టు చేసి రాంబిల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పప్పలను పోలీసు ఎస్కార్ట్‌తో దిమిలిలోని ఆయన సొంతింటికి తరలించి గృహనిర్భంధం చేశారు.
రాంబిల్లి : టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కసిరెడ్డి అప్పలస్వామి నాయుడు ఆధ్వర్యాన టిడిపి నాయకులు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి రాంబిల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
మునగపాక రూరల్‌ : మునగపాక మెయిన్‌ రోడ్‌లో సైకో జగన్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేసి ధర్నా చేశారు. దీంతో పోలీసులు టిడిపి నేతలు దొడ్డి శ్రీనివాసరావు, భీమరశెట్టి శ్రీనివాసరావు, దాడి ముసలి నాయుడు, పెంటకోట విజరు, జానకి తదితరులను అరెస్టు చేశారు. టిడిపి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావును పరవాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
పరవాడ: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని మండలంలోని వెన్నలపాలెం గ్రామంలో ఆయన స్వగృహంలో పోలీసులు శనివారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అనంతరం బండారుతో పాటు మాజీ జెడ్‌పిటిసి పైలా జగన్నాథరావును అచ్యుతాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును టిడిపి మండల అధ్యక్షులు వియ్యపు చిన్న తీవ్రంగా ఖండించారు.
బైరా దిలీప్‌ ఖండన
అనకాపల్లి : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును అరెస్ట్‌ చేయడమే కాక, నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా అనకాపల్లి జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర టీడీపీ నాయకులను గృహ నిర్బంధం చేయడాన్ని బైరా ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బైరా దిలీప్‌ చక్రవర్తి శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఎలాంటి కారణం, నోటీసు ఇవ్వకుండా తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను గృహ నిర్బంధం చేయటం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని దిలీప్‌ మండిపడ్డారు.