మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాలలో పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి సంఘటన జరగకుండా ముందస్తుగా జిల్లాలోని చోట్ల టిడిపి నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించగా, మరికొన్ని చోట్ల గృహనిర్బంధాలు జరిగాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రధాన కూడళ్లలో టిడిపి నాయకులు వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. సిఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం 11 గంటల వరకూ ఆర్‌టిసి బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు కూడళ్లలో పోలీసు గస్తీ ముమ్మరం చేశారు.
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పట్టణంలో శనివారం టిడిపి మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గ ఇన్ఛార్జి బోనెల విజయచంద్రతో పాటు టిడిపి కౌన్సిల్ సభ్యులను, నాయకులు ముందస్తు అరెస్టులు చేసి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టులకు నిరసనగా బైఠాయింపు
8వ వార్డు టిడిపి కౌన్సిలర్ కోరాడ నారాయణరావు,కార్యకర్తలు నాలుగు రోడ్లు కూడలి వద్ద రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి లు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడం తప్పుడు చర్యని, ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అరెస్టు చేశారని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని, తప్పుడు కేసు పెట్టారని ఈ కేసు నిలబడదని అన్నారు.
గుమ్మలక్ష్మీపురం : చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి ఇంటి వద్దకు వెళ్లి అరెస్టు చేశారు. ఆమెతో పాటు మండల కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు, సోనలి రామారావును అరెస్టు చేసి ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే ఎల్విన్ పేటలో తన ఇంటి వద్ద పలువురు టిడిపి నాయకులతో కలిసి ఉన్న రెండవ వర్గానికి చెందిన సీనియర్ నాయకులు బిడ్డిక పద్మావతి, మంజువాణి, కొండలరావు, రామకష్ణ, చలపతి, వల్లభ రావును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జియమ్మ వలస మండలంలో చినకుదమలో టిడిపి అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి డొంకాడ రామకష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావును అరెస్టు చేసి చినమేరంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎల్విన్ పేటలో టిడిపి నాయకులు మోకాళ్లపై నిరసన
గుమ్మలక్ష్మీపురంలోని పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. రెండో వర్గానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు బిడ్డిక పద్మావతి ఆధ్వర్యంలో నాయకులు మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు కొండలరావు, రామకష్ణ, చలపతి, మంజువాని, వల్లభ రావు ఉన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. అక్కడ నుంచి ఎల్విన్ పేట పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కడ్రక కళావతి, జానకి పలువురు కార్యకర్తలు ఉన్నారు.
కొవ్వొత్తిలతో నిరసన
గుమ్మలక్ష్మీపురంలో శనివారం రాత్రి టిడిపి నాయకులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం ఇంచార్జి తోయక జగదీశ్వరి, మండల కార్యదర్శి పోలూరు శ్రీనివాసరావు, నాయకులు సొంటేన రాజేష్ , జానకి తదితరులు పాల్గొన్నారు.
సిఎం దిష్టిబొమ్మ దహనం
కురుపాం : చంద్రబాబునాయుడు అరెస్ట్ నిరసనగా టిడిపి నాయకులు ర్యాలీలు, ధర్నాలు చేస్తారని ముందస్తుగా టిడిపి మండల కన్వీనర్ కేవీ కొండయ్య, టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సుకేశ్ చంద్రపండా, మాజీ ఎంపిపి జివి రమణమూర్తి, టిడిపి నాయకులు వెంపటాపు భారతి, చిలకల వెంకటరావు, చందక రామకష్ణను పోలీసులు తెల్లవారుజామున ఆరు గంటలకే ఇంటి నుంచి స్టేషన్‌కు తీసుకువెళ్లి అరెస్టు చేశారు. ఈ అరెస్టుకు నిరసనగా పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ దహనం చేసిన టిడిపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు వీరందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
సీతంపేట చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు సీతంపేటలో ధర్నా చేపట్టారు. హై స్కూల్ నుంచి బస్టాండ్ వరకూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకొని స్టేషన్‌కు తరలించారు. అయితే స్టేషన్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనలో టిడిపి సీనియర్ నాయకులు పడాల భూదేవి, బిడ్డిక దమయంతి నాయుడు, మాజీ ఎంపిపిలు సవర మాలయ్య, ఆరిక లచ్చుమయ్య, మాజీ జెడ్పీటీసీ పాలక రాజబాబు, టిడిపి మండల అధ్యక్షులు సవర తోట మొఖలింగం, మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ లు సవర మల్లేష్, కె.విశ్వనాథం, సవర మంగయ్య, సవర బి.జయలక్ష్మి, సూర్యారావు, బిడ్డిక రామకృష్ణ, లావేటి రమణ తదితరులు ఉన్నారు.
సాలూరు: నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణిను ఆమె నివాసంలో పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆమె నిర్బంధాన్ని చేధించుకుని రోడ్డు మీదకు వచ్చారు. అఫీసియల్ కాలనీ రోడ్డులో ఆమె కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు. దీంతో సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యాన పోలీసులు ఆమెను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, మాజీ కౌన్సిలర్ అప్పయ్యమ్మ, బి.పైడిరాజు అరెస్టయ్యారు. పోలీసు స్టేషన్ లో కూడా వారు బైఠాయించి సిఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్ దేవ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.
కొమరాడ : స్థానిక జంఝావతి జంక్షన్‌లో టిడిపి మండల అధ్యక్షులు శనాపతి శేఖర్‌పాత్రుడు ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర రహదారిపైనా, రామభద్రపురం జంక్షన్ వద్ద టిడిపి ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి తమ్మయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిరసన కార్యక్రమాల వద్దకు వచ్చి టిడిపి నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచే కత్తిపై పోలీసులు విడుదల చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎన్.మధుసూదన్ రావు, జి.సుదర్శన్ రావు, పి.వెంకటనాయుడు, బొంగు భానోజీరావు, ఎం.సింహాచలం, ఎం.వెంకటనాయుడు, ఎం.తిరుపతినాయుడు తదితరులున్నారు.
భామిని : మండలంలో ఎలాంటి సంఘటనలూ చేపట్టకుండా మండల టిడిపి నాయకులు లోపింటి రాజేష్, భూపతి ఆనందరావు, బిడ్డికి ప్రసాద్, మండల అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, ఇతర టిడిపి నాయకులను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. సాయంత్రం పోలీసులు నాయకులను విడుదల చేశారు. అనంతరం స్థానిక అంబేద్కర్ కూడలిలో టిడిపి నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయమని నినదించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు బోగాపురపు రవి నాయుడు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, మండలి కమిటీ సభ్యులు బిడ్డికి ప్రసాద్, సాకేటి రామారావు, సర్పంచ్ లోపింటి రాజేష్, అంపిలి కేశవ, కోరాడ రాజేష్, సునీల్ శాంత్రో, ఆగుతాముడి. మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం: మండలానికి చెందిన 25మంది టిడిపి నాయకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ నీలకంఠం తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు కొల్లి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాలనాయుడు తదితరులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తున్నట్లు చెప్పారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అరెస్టు దృష్ట్యా మండలంలోని పలు గ్రామాల్లో నిరసనలు వ్యక్తం చేస్తు రోడ్లపై నిరసనలు చేపట్టారు.
పాలకొండ : టిడిపి నాయకులు ఆందోళనకు సిద్ధం కావడంతో వారిని ఎక్కడికి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. టిడిపి అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు పల్లా కొండలరావు, మండల పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షులు గంటా సంతోష్ తదితరులను గృహానిర్బంధంలోకి తీసుకున్నారు. దీన్ని నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
బలిజిపేట : స్థానిక బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల పార్టీ వేణుగోపాలనాయుడు ఆధ్వర్యంలో మండల టిడిపి నాయకులు చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా నిరసనలు చేపట్టారు. కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మక్కువ : స్థానిక నాయకులు మావుడి ప్రసాదరావునాయుడు తో పాటు సుమారు 20 మందిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఉదయం స్టేషన్‌కు తరలించారు.
వీరఘట్టం : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట టిడిపి పాలకొండ నియోజకవర్గం ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ, నాయకులు నిరసన తెలిపారు. సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోవాలి, ఈ రాక్షసపాలన మాకొద్దు, అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు నిమ్మక జయకృష్ణ స్వగ్రామం ఎం.రాజుపురానికి పాలకొండ డిఎస్‌పి జివి కృష్ణారావు, సిఐ మురళీధర్, స్థానిక ఎస్‌ఐ ఎం.వెంకటరమణ గ్రామానికి వెళ్లి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వస్తున్న టిడిపి నాయకులను అరెస్టు చేశారు. ఈ అరెస్టులకు నిరసనగా స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద పాలకొండ నియోజకవర్గం బాధ్యులు నిమ్మక జయకష్ణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసనతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలోపార్టీ మండల అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్, పారిచర్ల వెంకటరమణ, మాచర్ల అనీలు, బల్ల హరి బాబు, శశి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కస్ప ఉమా శంకర్ , ఏ కుమారస్వామి , నీలకంఠ నాయుడు, జి గౌరు నాయుడు , లింగాల చంటి, రాయిపల్లి రత్నాకర్, నిర్మలమ్మ , కార్యకర్తల, అభిమానులు పాల్గొన్నారు.
డిపోకే పరిమితమైన బస్సులు
చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో శనివారం నుండే జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ డిపో వద్ద ఉన్న బస్సులను డిపో మేనేజర్ నిలిపివేశారు. దీంతో కాంప్లెక్స్‌కు వచ్చి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగి ఆటోలను ఆశ్రయించడంతో ఆటోలకు గిరాకీ పెరిగింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉదయం 11గంటల వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాలకొండ డిపో నుంచి సాయంత్రం 5గంటల తర్వాత బస్సులు తిరిగాయి.










