Oct 03,2023 22:34

పార్వతీపురం : అంబేద్కర్‌ విగ్రహానికి వినతిని అందజేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో జరగుతున్న నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి వినతి సమర్పించారు. అనంతరం బైపాస్‌రోడ్‌లో షిర్డీ సాయి మందిరంలో బాబా విగ్రహానికి వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులు నొక్కినంత మాత్రన ప్రభుత్వ వైఫల్యాలు దాగిపోతాయనుకోవడం భ్రమ అని, చంద్రబాబుకు న్యాయం జరిగి మచ్చలేని చంద్రునిలా తిరిగి వచ్చేంత వరకూ ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు దొగ్గ మోహనరావు, జి.రవికుమార్‌, నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బోను చంద్రమౌళి, జాగాన రవికుమార్‌, కౌన్సిలర్లు బి.గౌరినాయుడు, కోల మధుసరిత, తాతపూడి వెంకటరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టిడిపి, జనసేన రిలే నిరాహార దీక్షలు
సీతంపేట :
చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టు, పార్టీ శ్రేణులపై జరిగిన దమనకాండ, జగన్‌ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా బాబుతో నేను కార్యక్రమం టిడిపి మండల పార్టీ అధ్యక్షులు సవరతోట మొఖలింగం, జనసేన మండలం అధ్యక్షులు మండంగి విశ్వనాధం ఆధ్వర్యంలో సీతంపేటలో మంగళవారం సామూహిక రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక చంద్రరావు, ఐటిడిపి కోఆర్డినేటర్‌ హిమరక పవన్‌, బిడ్డిక అప్పారావు, స్వామినాయుడు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : టిడిపి అధినేత చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేశారని కురుపాం నియోజకవర్గం ఇంచార్జి తోయక జగదీశ్వరి అన్నారు. బాబుతో నేను అనే కార్యక్రమంలో భాగంగా ఇరిడి పంచాయతీ గాజులు గూడ, జల్లగూడ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు అడ్డాకుల నరేష్‌, బిడ్డిక శరత్‌, సొంటేన రాజేష్‌, తాడంగి రామారావు ఉన్నారు. అలాగే జియ్యమ్మవలస మండలం చినకుదమలో బాబుతో నేను కార్యక్రమం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అరుకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకష్ణ, మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, ఎంపిపి బొంగు సురేష్‌, సర్పంచ్‌ చెరుకుబిల్లి గిరి తదితరులు ఉన్నారు.