Sep 10,2023 21:16

 రాజంపేటలో నిరసన దీక్షలు చేపడుతున్న చమర్తి జగన్‌మోహన్‌రాజు, నాయకులు

రాజంపేట అర్బన్‌ : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్‌రాయుడు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సామూహికంగా నిరాహార దీక్ష చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి, నోటీకి నల్ల గుడ్డ కట్టుకుని నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రం బాగుపడాలంటే సైకో జగన్‌ పోవాలని, చంద్రబాబును విడుదల చేసేంతవరకు పోరాటాలు ఆగవని నినాదాలు చేసి హెచ్చరించారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టు అక్రమమని తెలిపారు. ఆయన్ను విడుదల చేసేంతవరకు పోరాటాలు ఆగవని, చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చమర్తి ఆధ్వర్యంలో రెండో రోజూ కొనసాగిన నిరసనలు
స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుతో రెండవ రోజు ఆదివారం కూడా రాజంపేటలో టిడిపి నాయకులు నిరసన తెలియజేశారు. ప్రముఖ విద్యావేత్త, నియోజకవర్గ సీనియర్‌ నాయకులు చమర్తి జగన్మోహన్‌ రాజు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జిలు ధరించి మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ నాయకులను గహనిర్బంధాలు, రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించిన వారిని హౌస్‌ అరెస్టులు చేశారు. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహ జ్వాల రగలటంతో పలు రకాలుగా నిరసన గ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అగ్రశ్రేణి నేతలు అరెస్టుతో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నేత చమర్తి జగన్మోహన్‌ రాజు మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వకుండా టిడిపి నాయకులను హౌస్‌ అరెస్టు చేస్తున్నారని వాపోయారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెబుతారన్నారు. ప్రపంచ మన్నలను పొందిన విజన్‌ ఉన్న నాయకుడు అయిన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారన్నారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట మాజీ ఎంపిపి చలమయ్య యాదవ్‌, టిడిపి నాయకులు కోమర వెంకట నరసయ్య, గాలి సుబ్బయ్య, భాస్కర్‌ రాజు, నందకుమార్‌, జయచంద్ర, నాగయ్య, హరినాథ్‌ రెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి పాల్గొన్నారు.
టిడిపి యువ నాయకులు గహనిర్భంధం
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ నేపథ్యంలో పోలీసులు ముందస్తు హౌస్‌ అరెస్టులలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు షాజహాన్‌ బాషా కుమారుడు, యువనాయకులు జునైద్‌ అక్బరీని మదనపల్లి పోలీసులు గహనిర్భంధం చేశారు. ఆదివారం ఉదయం నుండి షాజహాన్‌ బాషా ఇంటి వద్దకు పోలీసులు చేరుకుని జునైద్‌ అక్బరీని బయటకి రాకుండా అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న నాగూర్‌ వలి (షో ఆఫ్‌ శీనా),షాజహాన్‌ బాషా అనుచరగణం పెద్దఎత్తున చేరుకుని యువ నాయకుడికి సంఘీభావం తెలిపారు. పీలేరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్‌ సిఐడి పోలీసుల అక్రమ అరెస్టును పీలేరులో టిడిపి శ్రేణులు ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారం స్థానిక టిడిపి కార్యాలయం ముందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రేణులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
నిమ్మనపల్లి: తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీస్‌ యంత్రాంగం ఎక్కడికక్కడ గహ నిర్బంధం చేసింది. ఆదివారం ఉదయం నుంచి నిమ్మనపల్లి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ మదనపల్లి క్లస్టర్‌ ఇంచార్జ్‌ మునిరత్నంను, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులను స్థానిక పోలీసులు గహనిర్బంధం చేశారు