ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు సోమవారమూ కొనసాగాయి. టిడిపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబుకు మద్దతుగా సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంతకాల బోర్డుపై రక్తంతో సంతకాలు చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంఎల్‌ఎ గంటా మురళీ, టిడిపి సీనియర్ నాయకులు ముత్తారెడ్డి, సాయల సత్యనారాయణ, రావూరి కృష్ణ, కుక్కల మాధవరావు, కోనేరు సుబ్బారావు పాల్గొన్నారు.
టిడిపి శ్రేణులు మౌనదీక్ష
ముదినేపల్లి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ముదినేపల్లిలో గాంధీ జయంతిని పురస్కరించుకుని టిడిపి నేతలు మౌన దీక్ష చేపట్టారు. నియోజకవర్గ టిడిపి యువనేత కొడాలి వినోద్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకుని స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురష్కరించుకుని శాంతిమార్గంలో ప్రభుత్వం అవలంభిస్తున్న కక్షపూరిత విధానంపై నిరసన తెలిపామన్నారు. తప్పు చేయని చంద్రబాబుపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిన వైసిపి ప్రభుత్వాన్ని త్వరలో ప్రజలు బంగాళాఖాతంలో కలిపివేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పంతగాని సురేష్, బత్తుల రవి, నంగెడ్డ రాఘవేంద్రరావు, సిహెచ్.రాము, శ్రీరామ్ పాల్గొన్నారు.
ముసునూరు : గాంధీ జయంతి సందర్భంగా స్థానిక మండపం సెంటర్ వద్ద మొదటిగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపటిటన దీక్షలో గద్దే రఘుబాబు, కొల్లి గంగారామ్, మందలపు ధర్మరాజు, మసిముక్కు సుబ్బారావు, లక్కపాము కాంతారావు, చలమాల వెంకటేశ్వరరావు పర్వతనేని వెంకటేశ్వరరావు, మానం ఘంటేశ్వరరావు, పలువురు టిడిపి నాయకులు ఈ దీక్షలో పాల్గొని గాంధికి చంద్రబాబు తప్పు చేయలేదంటూ వినతిపత్రం అందజేశారు.
మండవల్లి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు, కార్యకర్తలు భైరవపట్నం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో మాజీమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడడం తప్ప, రాష్ట్రాభివృద్ధిని, ప్రజల శ్రేయస్సును పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి కమిలి విఠల్‌రావు, కైకలూరు జెడ్‌పిటిసి మాజీ సభ్యులు బొమ్మనబోయిన విజయలక్ష్మి పాల్గొన్నారు.
చాట్రాయి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో చేపట్టిన సత్యమేవ జయతే నిరాహార దీక్షకు మద్దతుగా చనుబండ, పోలవరం, చీపురుగూడెం గ్రామాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవరెడ్డి, మండల కార్యదర్శి కంచర్ల హనుమంతరావు కూర్చున్నారు. పోలవరంలో ఎర్ర హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో, చీపురుగూడెంలో ఎం.జగదీష్ ఆధ్వర్యాన దీక్షలు చేపట్టారు. ఆయా దీక్షల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










