ప్రజాశక్తి-బొబ్బిలి : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్ర ప్రజలను పీడిస్తున్న సైకో జగన్ పాలన పోవాలంటూ టిడిపి ఆధ్వర్యాన శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా మోత మోగించారు. స్టీల్ పల్లాలను కొడుతూ, డప్పులతో శబ్ధం చేస్తూ కార్యక్రమం చేపట్టారు. బొబ్బిలిలోని కోటలో నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా ఆధ్వర్యాన కార్యకర్తలు విజల్ వేస్తూ, పల్లాలు కొడుతూ మోత మోగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. అభివృద్ధి చేయకుండా విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతికి చంద్రబాబుకు సంబంధం లేనప్పటికీ అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విజయనగరంలోని టిడిపి కార్యాలయంలో పోలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు, జనసేన నాయకులు గురాన అయ్యలు, జిల్లా ప్రధానకార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, తదితరులు పళ్లాలు కొడుతూ శబ్ధం చేశారు. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున ఆధ్వర్యాన,నెల్లిమర్లలో సువ్వాడ రవిశేఖర్ ఆధ్వర్యాన టిడిపి శ్రేణులు మోత మోగిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ తీర్థం జంక్షన్ లో పల్లాలు మోగిస్తూ శబ్ధం చేశారు. నాయకులు అవ నాపు సత్యనారాయణ, కాళ్ళ రాజ శేఖర్ నల్లం శ్రీను, కోటపాటి తిరుపతి రావు, అట్టాడ శ్రీధర్, చింత పల్లి సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మండలం ద్వారపూడిలో బొద్దల నర్సింగరావు, విటి అగ్రహారంలో మాజీ కౌన్సిలర్ రొంగలి రామారావు ఆధ్వర్యాన కార్యక్రమం నిర్వహించారు.










