
ప్రజాశక్తి - కొత్తచెరువు : చంద్రబాబు అరెస్టు కుట్ర పూరితమనిమాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని తిప్పా పట్లపల్లిలో టిడిపి నాయకులతో కలసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కింద యువతకు శిక్షణ ఇవ్వడంతో ఎంతోమంది ఉద్యోగాలు వచ్చాయన్నారు. దురుద్దేశంతోనే వైసిపి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఆయనను జైలుకు పంపిందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున భయభ్రాంతులకు గురి చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, నాయకులు సప్లయర్స్ రామ్మోహన్, వెంకటరమణప్ప, శేషప్ప, గాజుల చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు
పాదయాత్ర : చంద్రబాబునాయుడు విడుదల చేయాలని టిడిపి నాయకులు కార్యకర్తలు మంగళవారం కొత్తచెరువు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర మామిల్లికుంట క్రాస్ కప్పల బండ వెంకట గారి పల్లి క్రాస్ మారెమ్మ ఆలయం వరకు కొనసాగింది. ఈ పాదయాత్రకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, నాయకులు బోయ రాజు, లక్ష్మీనారాయణ, భైరవుడు, నల్లమాడ శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు.
మౌనదీక్షలో పాల్గొన్న బికె..
పెనుకొండ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా రాజ్‌ఘాట్ లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద చేపట్టిన మౌనదీక్షల్లో పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన నారా లోకేష్ తో కలసి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎంపీ, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద టిడిపి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కె.పార్థసారథి ఆదేశాల మేరకు మంగళవారం బాబుతో నేను కార్యక్రమాన్ని తెలుగు మహిళలు నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని మండలాలకు చెందిన తెలుగు మహిళలు 7వ రోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.
నిరసన తెలిపితే అరెస్టు చేస్తారా.. ? : పరిటాల
ధర్మవరం టౌన్ : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళుతుంటే అరెస్టులు చేస్తారా.. అని మాజీ మంత్రి పరిటాల సునీత, తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం పట్టణంలో పోలీసులు మాజీ మంత్రి పరిటాలసునీతను అడ్డుకున్న సం ఘటనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ కదిరిపట్టణంలో యాత్ర చేపట్టారని, ఈ యాత్రలో ఉమ్మడిజిల్లా నాయకులు పాల్గొనాలని భావించారు. దీంతో వెంకటాపురంనుండి మాజీ మంత్రి పరిటాల సునీత వెళ్తుండగా ధర్మవరంలోని శ్రీలక్ష్మీ చెన్న కేశవపురంలో పోలీసులు అడ్డుకున్నారు. కదిరికి వెళ్లడానికి అనుమతులు లేవని వెళ్లరాదని పరిటాల సునీతను నిలిపివేశారు. దీంతో పరిటాలసునీత పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పోలీసులకు, టీడీపీ నాయకులకు వాగ్వావాదం జరిగింది. ఆమెను బలవంతంగా వాహనంలో ఎక్కించి ధర్మవరం పట్టణంలోని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్దకు తీసుకువచ్చారు. దీంతో దీక్ష చేపడుతున్న 40 వార్డుల టీడీపీ ఇన్చార్జులు, టీడీపీ నాయకులతో కలసి పరిటాల సునీత రోడ్డుపై బైటాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గడంతో పోలీసులకు. టీడీపీ నాయకులకు వాగ్వావాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పరిటాలసునీత, చిలకం మధుసూదన్‌రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి శిబిరం వద్ద నుండి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ర్యాలీగా చేరుకుని అక్కడ ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ మనం ఏ రాజ్యాంలో ఉన్నామో అర్థంకాలేదన్నారు. ప్రతిపక్షాలు రోడ్డు ఎక్కగానే అరెస్టులు చేయమని సీఎం జగన్‌రెడ్డి చెప్పారా అంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ రాష్ట్రం ఏమైనా జగన్‌రెడ్డికి రాసిచ్చిన జాగీరా అంటూ మండిపడ్డారు. చిలకం మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలు కనీసం నిరసన కార్యక్రమాలు చేయనివ్వకుండా పోలీసుల ద్వారా ఈ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి పాలను సాగుతోందని, ఇది ఎంతో కాలం సాగదని, త్వరలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారని అన్నారు.
జైలర్‌కు పోస్టల్ లెటర్లు
మడకశిర నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా స్థానిక నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసు కొట్టివేయాలని పోస్టల్ లెటర్లు రాసి రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు పంపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి చంద్రప్ప, సత్య సాయి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు భక్తర్ సాబ్, మండల నాయకులు లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మనోహర్, క్లస్టర్ ఇన్‌ఛార్జులు కల్లు మర్రి నాగరాజు, రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ మల్లికార్జున, డాక్టర్ సెల్ అధ్యక్షుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
వినూత్న నిరసన
ఓబుళదేవరచరువు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మోకాలు మీద కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. దీనికి తగిన గుణపాఠం చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జయచంద్ర, టిఎన్‌టియుసి నియోజకవర్గ అధ్యక్షులు నిజాంవలి, తెలుగు యువత అధ్యక్షులు బి ఓబుల్ రెడ్డి, మీ సేవ సుధాకర్, టిఎన్‌టియుసి మండల అధ్యక్షులు చాంద్‌బాషా, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు సౌదీ నాగరాజు, మైనార్టీ నాయకులు పి షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు .
అడ్డుకున్న పోలీసులు
నల్లచెరువు :కదిరిలో కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనకుండా తనకల్లు టిడిపి నాయకులను నల్లచెరువు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. ఈ విషయంపై కొద్దిసేపు పోలీసులకు నాయకులకు వాగ్వావాదం చోటు చేసుకుంది. అనంతరం నాయకులను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షులు కావడి ప్రవీణ్ కుమార్, పిజి. మల్లికార్జున, తాజుఖాన్, జల్ల రవి, తదితరులు పాల్గొన్నారు.
నియంత పై పోరాడుదాం
హిందూపురం : రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తున్న సిఎంపై పోరాటం చేయడమే కాకుండా చంద్రబాబుకు అండగా ఉంటామని టిడిపి నాయకులు, బాలకృష్ణ అభిమానులు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా పట్టణంలోని నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. అనంతరం కళ్ళకు గంతలు కట్టుకొని, మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజక వర్గ కో ఆర్టినేటర్ శ్రీనివాస రావు, బాలకృష్ణ అభిమాన సంఘం జాతీయ కన్వీనర్ సతీష్ కుమార్, నాయకులు రాము, రమేష్ కుమార్, అమర్నాథ్, నడబిరసూల్, రమేష్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
7వ రోజుకు రిలే నిరాహార దీక్షలు
పుట్టపర్తి క్రైమ్ : పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు మంగళవారానికి 7వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని టిడిపికార్యాలయంలో పట్టణ కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు మహిళా నాయకురాలు ఈ దీక్షలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీరామ్ రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి భూమయ్య, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంబులెన్స్ రమేష్, నాయకులు శ్రీనివాసులు, నరేష్ కుమార్ యాదవ్, సురేంద్ర యాదవ్, సుధాకర్, మాల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
మడకశిర : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యదర్శి బిఎస్. గురుమూర్తి, మండల కన్వీనర్ దాసిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం స్థానిక విలేకరులతో సమావేశమయ్యారు. నాలుగున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి పిచ్చి నిర్ణయాలవల్ల రాష్ట్రం అధోగతికి చేరుకుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మికులందరు ఏకమై వైసిపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బాబు అరెస్టుతో జగన్ రెడ్డి తనగోతిని తానే తవ్వుకొన్నాడని అన్నారు. ఎన్నికలు ఎపుడూ వచ్చినా జగన్‌కు రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్బంగా దాదాపు 500 మంది నాయకులు రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా లేఖలు రాసి రిజస్టర్ పోస్ట్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి ఈరన్న, క్లస్టర్ ఇన్‌ఛార్జి భరత్, తెలుగుయువత అధ్యక్షులు బాలకృష్ణ, టిఎన్‌టియుసి జిల్లా ఉపాధ్యక్షులు సిఎన్. మూర్తి, మాజీ ఎంపీపీలు కిట్టప్ప, పాండురంగప్ప, సిద్ధగంగప్ప, నరసింహప్ప, సీనియర్ నాయకులు శ్రీరంగప్ప, లక్ష్మీనరసప్ప, రాజకుమార్, హనుమంతరాయ తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : కక్షపూరిత విధానాలే లక్ష్యంగా అధికార పార్టీ పనిచేస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ కదిరి పట్టణంలో కందికుంట ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు: ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కందికుంట మాట్లాడుతూ వైసిపి ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని. ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ , నాయకులు, కష్ణమోహన్ నాయుడు, రాజశేఖర్ బాబు, మోపురిశెట్టి చంద్రశేఖర , గంగయ్య నాయుడు, బంగారు కష్ణమూర్తి, మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు పర్వీన్ భాను, డైమండ్ ఇర్ఫాన్ ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు,