ప్రజాశక్తి-బొబ్బిలి : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు కాదని, అవినీతికి పాల్పడటం వల్లే అరెస్టు చేశారని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్పష్టంచేశారు. గురువారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్టు చేసినట్లు టిడిపి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు అవినీతిపై రెండేళ్ల నుంచి దర్యాప్తు సాగుతోందని, అక్రమాలు రుజువు కావడంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పారు. నకిలీ కంపెనీకి జిఎస్‌టి కట్టకుండా మార్పు చేసినట్లు అధికారులు గుర్తించినట్లు చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయవాదులతో కేసును వాదించిన చంద్రబాబు తప్పు చేయలేదని న్యాయవాదులు అనడం లేదంటే అవినీతి చేసినట్లు అంగీకరించడమేనన్నారు. చంద్రబాబు చేసిన అవినీతికి శిక్ష తప్పదన్నారు. రాజ్యాంగానికి లోబడి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య సేవలు అభినందనీయం
ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు అన్నారు. గురువారం ఇందిరమ్మ కాలనీలో బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిమ్స్ ఆస్పత్రి సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాల నాయుడు, ఆర్‌డిఒ శేషశైలజ, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీ, వైస్ చైర్మన్ చెలికాని మురళీకృష్ణ, ఎఎంసి వైస్ చైర్‌పర్సన్ తెంటు పార్వతి, తహశీల్దార్ రాజేశ్వరరావు, పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ అధ్యక్షులు పొట్నూరు రాజ్ కిరణ్, వైసిపి నాయకులు చంద్రంపూడి రమేష్, తదితరులు పాల్గొన్నారు.










