Sep 10,2023 21:56

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం పీడిక రాజన్న దొర

పాచిపెంట: ప్రతిపక్ష పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కక్ష సాధింపు చర్య కాదని, పక్కా ఆధారాలతోనే సిఐడి అరెస్టు చేసిందని డిప్యూటీ సిఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. మండలంలోని కొటికిపెంటలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష టిడిపి నాయకులు కావాలనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం ఆరోపించారు. 2017 నుంచి సుమారు ఆరు స్వయం ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు నిర్వహించి రూ.240 కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. ఈ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేకపోతే సిఐడి అడిగిన ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను, అనే సమాధానాలు ఎందుకు చెబుతారని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్టు చేసేటప్పుడు బలమైన ఆధారాలు లేకుండా సిఐడి అరెస్టు చేయదు కదా అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి, సానుభూతి పొందేందుకు టిడిపి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విలేకరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాల నాయుడు, జిల్లా కార్యదర్శి పాచిపెంట వీరంనాయుడు, స్థానిక సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు, స్టేట్‌ బీసీ సెల్‌ కార్యదర్శి సలాది అప్పలనాయుడు, మండల యువజన విభాగమ అధ్యక్షులు శనాపతి నారాయణరావుపలువురు సర్పంచులు ఉన్నారు.