
ప్రజాశక్తి-దర్శి: చంద్రబాబునాయుడును అరెస్టు చేయడం అన్యాయమని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు అన్నారు. శుక్రవారం స్థానిక పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో ఆయన మాట్లాడారు. అనంతపురం నుంచి అమరావతి వరకు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర దర్శికి చేరుకున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రాజుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు మాట్లాడుతూ అన్ని వర్గాలపై కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తప్పకుండా చంద్రబాబునాయుడుకు న్యాయం జరుగుతుందని, త్వరలో బయటకు వచ్చి మరలా ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పాపారావు, జిల్లా అధ్యక్షులు శ్యామ్, వైస్ చైర్మన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గర్నెపూడి స్టీవెన్, అధికార ప్రతినిధి చల్లయ్య, మాజీ జడ్పీటీసీ పౌలు, నాయకులు పరిశుద్ధరావు, మండల పార్టీ అధ్యక్షులు చిట్టే వెంకటేశ్వర్లు, నాగులపాటి శివకోటేశ్వరరావు, పిడతల నెమిలయ్య, కూరపాటి శ్రీను, ఓబుల్‌రెడ్డి, మండల అధ్యక్షులు యాదగిరి వాసు తదితరులు పాల్గొన్నారు.
దుష్ట పాలనకు చరమగీతం పాడాలి: డాక్టర్ ఉగ్ర
కనిగిరి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు, వైసిపి దుర్మార్గ పు పాలనపై ప్రజా చైతన్యం కలిగించేందుకు మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమం నిర్వహిస్తున్న ట్టు కనిగిరి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలియజేశారు. శుక్రవారం ఉదయం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని శంఖవరం, సాయంత్రం కనిగిరి మండలంలోని తాళ్లూరు గ్రామంలో మన ఊరు-మన ఉగ్ర కార్యక్రమం కొనసాగింది. ఉగ్ర పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చైతన్యపరుస్తూ ముందుకు సాగారు. 'బాబుతో నేను' కరపత్రాలు పంపిణీ చేస్తూ చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రజలకు వివరించారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, నుదురుపాటి సుబ్బయ్య, తమ్మినేని వెంకటరెడ్డి, చింతలపూడి తిరుపాలు, నంబుల కొండయ్య, కడప సుధాకర్, బాలు ఓబుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.