
ప్రజాశక్తి - మొగల్తూరు
టిడిపి అధినేత, మాజీ సిఎం చంద్రబాబుపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడం దారుణమని టిడిపి నేతలు అన్నారు. ముత్యాలపల్లిలో శుక్రవారం ఆ పార్టీ నేతలు ఉరితాళ్లతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బందన నరసింహస్వామి, కొల్లాటి బాలకృష్ణ, దొంగ శ్రీను, నాగిడి రాంబాబు, కొల్లాటి మూలస్వామి, నాగేశ్వరరావు, పెంటయ్య, కోటేశ్వరరావు, విజయకుమార్, వాటాల శ్రీను పాల్గొన్నారు.
భీమవరం రూరల్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం స్థానికంగా టిడిపి భీమవరం మండల అధ్యక్షుడు రేవు వెంకన్న ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ దీక్షలను టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి ప్రారంభించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటమి ఖాయమని తెలిసి జగన్ చంద్రబాబును అక్రమ కేసులతో జైలుకు పంపారన్నారు. మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన, టిడిపి కూటమితో వైసిపి ఘోరఓటమి పాలవ్వడం ఖాయమన్నారు. దొంగపిండి సర్పంచి బొడ్డు రేవతిమోహన్, మాజీ ఎంపిపి బర్రె నెహ్రూ మాట్లాడగా వేండ్ర శ్రీనివాస్, గంటా త్రిమూర్తులు, కోళ్ల నాగబాబు, మాదాసు కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పట్టణంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు నల్ల గుడ్డలు కట్టుకుని టిడిపి నేతలు రిలేదీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు, మండల అధ్యక్షులు వాతాడ ఉమామహేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో గుత్తుల సాయి, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉండి: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలో శుక్రవారం పాలకోడేరు మండల నాయకులు కూర్చున్నారు. వీరికి జనసేన ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు ఆధ్వర్యంలో జనసైనికులు మద్దతు పలికి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, జనసేనాని జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు తరలించడంలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. కార్యక్రమంలో టిడిపి నేతలు కరిమెరక నాగరాజు, దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు, జనసేన నేతలు గవరలక్ష్మి అనిల్, యడవిల్లి వెంకటేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, తోట వాసు పాల్గొన్నారు.
ఆచంట: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆచంటలో టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజు శుక్రవారం కొనసాగాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, నేతలు కేతా మీరయ్య, గొడవర్తి శ్రీరాములు, బలుసు శ్రీరామ్మూర్తి, నెక్కంటి ప్రభాకర్, కేతా మురళి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ స్థానిక గొర్రెల శ్రీధర్ కాంప్లెక్స్ వద్ద టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాహారదీక్షలు శుక్రవారం మూడో రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ సంఘీభావం తెలిపి మాట్లాడారు. కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, రామిశెట్టి సురేష్, పుల్లా బాబి, అడపా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తణుకు: రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ శుక్రవారం మసీదులో ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ సొర సాహెబ్, ఎమ్‌డి సాదిక్, షేక్ సాయి, షేక్ శోభన్, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ టిడిపి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు శుక్రవారం మూడో రోజు కొనసాగాయి. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామానికి చెందిన జనసైనికులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచి మణికంఠ, సాయి హరీష్ కుమార్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.