ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావులను అక్రమంగా అరెస్టుచేయడాన్ని నిరసిస్తూ ఇంటూరి నాగేశ్వరరావు సతీమణి ఇంటూరి సౌజన్య తో పాటు తెలుగు మహిళలు సోమవారం రోడ్లపైకి వచ్చారు. పోలీసుల తీరును తప్పుపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించడంతోపాటు, అక్కడక్కడ రోడ్లపై బైఠాయిస్తూ నిరసనలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో బంద్ కార్యక్రమంపై నాయకులతో చర్చిస్తున్న సమయంలో భారీగా పోలీసులు ఇంటూరి నాగేశ్వరావుని చుట్టుముట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పార్టీ నాయకులు నాగేశ్వరరావుని కార్యాలయం లోపలికి తీసుకువెళ్లి షట్టర్ వేసేశారు. పోలీసులు బలవంతంగా షట్టర్ తీసి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాగేశ్వరరావుని అరెస్టు చేసి కావలి పోలీస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న నాగేశ్వరావు సతీమణి సౌజన్య, ఆయన తల్లి వరమ్మ, దాదాపు 50 మందికి పైగా మహిళలు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు ముందుగానే పసిగట్టి, పామూరు రోడ్డు జంక్షన్, ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద మోహరించారు. మహిళలు పోలీసులను పక్కదారి పట్టించి, అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. అక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్దకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. దాదాపు అరగంటసేపు ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ హౌరెత్తించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. ఈలోపు డిఎస్‌పి రామచంద్ర ఆధ్వర్యంలో పట్టణ సిఐ నసీఫ్, గుడ్లూరు సీఐ సుబ్బారావు, పట్టణ రూరల్ ఎస్‌ఐలు హనీఫ్, తిరుపతయ్య, అధిక సంఖ్యలో పోలీసు సిబ్బంది చుట్టుముట్టి వారిని అక్కడ నుంచి బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించారు. ఇంటూరి నాగేశ్వరరావు ఆచూకీ తెలియక తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయన వెంటనే విడుదల చేయాలని, అప్పటివరకు ఆందోళన విరమించేది లేదని మహిళలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గడంతో, మహిళలు మళ్లీ అక్కడి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడ మరో అరగంటసేపు నినాదాలతో హౌరెత్తించారు. తర్వాత అక్కడి నుంచి పామూరు బస్టాండ్, పామూరు రోడ్డు జంక్షన్ వద్దకు ర్యాలీ చేరుకోగానే పోలీసులు మరోసారి వారిపై ఒత్తిడి పెంచి, ఆందోళన విరమించాలని హెచ్చరించారు. ఈ సందర్భంలో రావి సరిత అనే మహిళా కార్యకర్త స్పహ తప్పి పడిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించి మళ్లీ అక్కడ బైఠాయించారు. తన భర్తతో ఒక్కసారైనా మాట్లాడించాలని లేకుంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని ఇంటూరి సౌజన్య భీష్మంచడంతో, పోలీసులు నాగేశ్వరరావు చేత ఆమెతో ఫోన్లో మాట్లాడించారు. దీంతో శాంతించిన మహిళలు కార్యక్రమాన్ని అంతటితో ముగించారు. ఈ సందర్భంగా మీడియాతో సౌజన్య మాట్లాడుతూ, పార్టీ ఆఫీసులో కూర్చుంటే ఎలా అరెస్టు చేసి తీసుకెళ్తారని ప్రశ్నించారు. పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, ప్రధాన కార్యదర్శి కల్లూరి శైలజ, నెల్లూరు పార్లమెంట్ మహిళా కార్యదర్శి బత్తిన ఆదెమ్మ, కందుకూరు మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు మన్నం శైలజ, రావి సరిత, ముప్పరాజు హారిక, అశ్విని, రాధ, రసూల్ బి, ఎస్తేరమ్మ, శ్రీ లక్ష్మమ్మ, దావులూరి శేషమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.










