చంద్రబాబు అరెస్టు చర్చనీయాంశం
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి కర్నూలు
నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం సిఐడి పోలీసులు అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఈ నెల 7న ఆయన అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నంద్యాల జిల్లా ఫ్యాపిలి మీదుగా బనగానపల్లెలో రాత్రి బస చేశారు. 8న ఉదయం మహిళలతో ముఖాముఖి కార్యక్రమం ముగించుకుని సాయంత్రం నంద్యాల బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభ ముగిశాక ఆయన నంద్యాల ఆర్‌కె.ఫంక్షన్ హాలులో బస చేశారు. అర్థరాత్రి నుంచి ఆయనను అరెస్టు చేస్తారని పుకార్లు వచ్చాయి. టిడిపి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఆర్‌కె ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. 9న ఉదయం 6-45 గంటలకు చంద్రబాబును అరెస్టు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆర్‌టిసి బస్సులు నిలిపివేయడం, దుకాణ సముదాయాలను మూయించి నిరసన తెలిపారు. ముఖ్య నాయకులను ఎక్కడికడక్కడ అరెస్టు చేయడంతో ఆర్‌టిసి బస్సులు యథావిధిగా తిరిగాయి. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ చంద్రబాబు అరెస్టును ఖండించాయి.
ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఆయన పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులపాటు ఒక మోస్తరు వర్షం కురిసింది. ఎండుతున్న పంటలకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ ఖరీఫ్‌ను పూర్తిస్థాయిలో గట్టెకించే స్థాయిలో వర్షం కురవలేదు. ప్రధాన ప్రాజెక్టులు తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులలో నీటిమట్టాలు పెద్దగా పెరగలేదు.
ఎస్‌ఐ సెలక్షన్ల దేహదారుఢ్య పరీక్షలు వర్షం కారణంగా రెండురోజుల పాటు వాయిదా పడ్డాయి. మూడోరోజు తిరిగి యథావిధిగా కొనసాగాయి.
అధిక ధరలు, విద్యుత్ భారాలు తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని సిపిఎం ఆధ్యంలో కలెక్టరేట్ల్ ఎదుట నిరసన తెలిపారు. అంతకు ముందు వరుసగా రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మొదటి రోజు సంతకాల సేకరణ, రెండోరోజు సచివాలయాల వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. ఆ తరువాత కలెక్టరేట్‌తో పాటు అన్ని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేసి వినతిపత్రాలు సమర్పించారు. గత రెండు నెలల పాటు ఆకాశాన్నంటిన టమాట ధర ఈ వారంలో పూర్తిగా పతనమైంది. కర్నూలు, పత్తికొండ, నంద్యాల జిల్లా ప్యాపిలి టమోటా మార్కెట్‌లో 25 కిలోల బాక్సు రూ.50 పలకడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదని రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆదోనిలో ఒక పోలీస్‌కానిస్టేబుల్, కర్నూలులో ఎఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అధికారుల వేధింపులా లేక ఆర్థిక ఇబ్బందులా అనేది అధికారులు తేల్చని పరిస్థితి ఉంది. ఏదేమైనా పోలీసు కుంటుంబాల్లో ఆందోళన మొదలైంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ యుటిఎఫ్ బహిష్కరించింది. జీతాలు రాకుంటే పండగలెలా చేసుకుంటారని ప్రశ్నించారు. హమాలీ కార్మికులకు సమగ్ర రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని వరుసగా నిరసనలు కొనసాగాయి. ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు సమర్పించారు.
eevaram Nandayala










