
ప్రజాశక్తి -పెనుకొండ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమమని టీడీపీ జిల్లా అధ్యక్షులు బికె. పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సామూహిక రిలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిశీలకులు నరసింహ యాదవ్, నాయకులు కురుబ కృష్ణమూర్తి, రొద్దం నరసింహులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, మునిమడుగు చిన్న వెంకటరాముడు, రఘువీర చౌదరి, తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్ష కు సిపిఐ జిల్లా అధ్యక్షులు వేమయ్య యాదవ్, కాటమయ్య, శ్రీరాములు తదితరులు నాయకులు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా బికె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారన్నారు.ఈ బుధ్ధిలేని జగన్ కు రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు న్యాయవాదులు శరత్, రాజేష్ నాయక్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు సిద్దయ్య, సిద్దలింగప్ప, టౌన్ కన్వీనర్ రవి శంకర్, బోయ గాయిత్రి, నాగమణి, అనసూయమ్మ, రామకృష్టప్ప, చిన్నప్పయ్య శ్రీనివాసులు,రామలింగ,నాగరాజు, గొందిపల్లి సూరి తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పైశాచిక ఆనందం కోసం వ్యవస్థలన్నిటిని సర్వనాశనం చేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా 'మేము సైతం బాబు'తో కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కందికుంట వెంకటప్రసాద్ తన సతీమణి యశోదా దేవితో కలిసి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు జగన్ చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. నేరారోపణ రుజువుకాకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన విధానం దుర్మార్గమన్నారు. జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా అహింస పద్ధతిలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. సాయంత్రం ఐదు గంటలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మోపురిశెట్టి చంద్రశేఖర, డైమండ్ ఇర్ఫాన్, రాజశేఖర్ బాబు, బండారు మనోహర్ నాయుడు, గంగయ్య నాయుడు, కృష్ణమూర్తి, మహిళా నాయకురాలు పర్వీన్ భాను, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బ : చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బుధవారం రాత్రి టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేయడం అన్యాయమని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 'బాబుతోనే నేను' కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేపట్టారు. పరిటాలశ్రీరామ్ చేపట్టిన దీక్షకు జనసేన, ఎమ్మార్పీఎస్, విద్యార్థిసంఘాలనాయకులు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టును దేశవ్యాప్తంగా వ్యతిరేకత కనపడుతోందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రతి పైసాకు లెక్కచూపిస్తామని అధికారులు అంటున్నారంటే వాటిని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ దీక్షలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.