Sep 10,2023 21:26

కడప : దీక్షలు ఉద్దేశించి మాట్లాడుతున్న టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి

కడప అర్బన్‌ : రాష్ట్ర ప్రజలు జగన్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు .తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆదివారం ఎన్‌టిఆర్‌ కూడలిలో కడప నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి రెడ్డప్పగారి గారి మాధవి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు గోవర్ధన్‌, హరి ప్రసాద్‌, రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్‌ మాజీ సభ్యులు పీరయ్య, రాంప్రసాద్‌, కొమ్మలపాటి సుబ్బరాయుడు, జిలాని బాష, వెంకటేష్‌, రామలక్ష్మమ్మ, దియావుద్దీన్‌, రంతు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగన్‌ ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా, తెలుగుదేశం పార్టీ పడి లేచిన కెరటంలా ఎగిసి ప్రజాదరణ పొందుతుందన్నారు. సుపరిపాలన చేతగాని జగన్‌, కుట్రలతో అరెస్టులు చేయించి జైళ్లను నింపుతున్నారని విమర్శించారు.ఎన్ని కుట్రలు చేసినా న్యాయస్థానంలో నిర్దోషిగా చంద్రబాబు నిరూపణ అవుతారని ఆయన అన్నారు. కడప నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి మాధవి మాట్లాడుతూ జగన్‌ పాలన తుగ్లక్‌ పాలనను తలపిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్‌ చేయించి జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారని, అక్రమ అరెస్టులపై నిప్పులు చెరిగారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శులు బాలిశెట్టి హరిప్రసాద్‌, గోవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎఫ్‌ఐ ఆర్‌లో లేని చంద్రబాబు పేరును అరెస్టుకు ముందు ఎలా చేర్చారని ప్రశ్నించారు. 16 నెలలు అక్రమార్జన కేసుల్లో జైల్లో ఉన్న జగన్‌, బాబారు హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి బయట తిరుగుతున్నారని, ఆయన పెట్టుకున్న బెయిల్‌ రద్దవుతుందని జోస్యం చెప్పారు. అక్రమ కేసులు కోర్టులో నిలువ లేవన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, 2024 లో చంద్రబాబుకు పట్టం కడతారన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, అమీర్‌, బిట్ట శ్రీధర్‌, కాసిం, రవికుమార్‌, సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌) : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. నెహ్రూ రోడ్‌ లోని తన కార్యాలయంలో నుంచి శివాలయం సెంటర్‌ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ నిరసన దీక్ష చేపట్టారు. చంద్రబాబు నాయుడును రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బందులు గురిచేస్తుందని, ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ నంద్యాల వరద రాజులరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ పట్టణ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ మున్సి పల్‌ చైర్మన్‌ ఆసం రఘురాం రెడ్డి, శ్రీని వాసులరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
జమ్మలమడుగు రూరల్‌ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసనగా జమ్మలమడుగు ఇన్‌ఛార్జి చదిపిరాళ్ళ భూపేష్‌ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జమ్మలమడుగు పాత బస్టాండ్‌ ఆవరణంలో సామూహిక నిరాహార దీక్ష చేపటారు. ఈ సందర్భంగా భూపేష్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చేలా జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి కేవలం పగ ప్రతీకారాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ అధికార దాహంతో అధికారంలోకి వచ్చి అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. సాయంత్రం దీక్షను విరమించారు. అంతకుముందు సిపిఐ నాయకులు వెంకట సుబ్బారెడ్డి, జనసేన నాయకులు అల్లం సూరి భూపేష్‌ రెడ్డి నిరహాదీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి, పోలీట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, సీనియర్‌ నాయకులు ద్వారకచర్ల కాటిరెడ్డి, దేవగుడి యూత్‌ నాగేశ్వర రెడ్డి, ఎస్టీ నాయకులు హనుమంతు నాయక్‌, దువ్వూరు మురళి, తులసిరెడ్డి, భూసిరెడ్డి, అన్నెబొయిన కొండయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, క్లస్టరు, యూనిట్‌, మండల, గ్రామ, వార్డు,కార్యవర్గ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. సామూహిక నిరాహార దీక్షలకు సిపిఐ పార్టీ వారు సంఘీభావం తెలిపినారు.