వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్‌లు, ఐస్ క్రీమ్‌లు, స్మూతీస్ లాంటి చల్లని పదార్థాలు కావాలని మారాం చేస్తుంటారు. కానీ బయట తయారుచేసే అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఇస్తుండాలి. ఒకవేళ ఐస్‌క్రీమ్‌లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి.. ఎంచక్కా ఇంట్లోనే ఇలా పళ్ల రసాలతో పుల్ల ఐస్, స్మూతీస్ తయారుచేసి ఇవ్వొచ్చు. వీటివల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. కాబట్టి పిల్లలు కూడా ఎంజారు చేస్తారు. పిల్లలతో పాటు పెద్దలూ వీటిని ఆస్వాదించొచ్చు. ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..!
దూద్‌కా షర్బత్
కావాల్సిన పదార్థాలు : పాలు - లీటరు, కస్టర్డ్ పౌడర్ - 1/4 కప్పు, పంచదార - 1/2 కప్పు, నీళ్లు- 4 కప్పులు, సబ్జా గింజలు - 1/4 కప్పు, స్ట్రాబెర్రీ జెల్లీ - 400 మి.లీ, స్ట్రాబెర్రీ జెల్లీ మిక్స్ - 1 ప్యాకెట్, బాదం - 2 టీస్పూన్లు, కిస్మిస్ - 2 టీస్పూన్లు, ఖర్జూరం తరుగు - 2 టీస్పూన్లు, ఐస్ క్యూబ్స్ - కొద్దిగా, పిస్తా - టీస్పూన్.
తయారుచేసే విధానం : ముందుగా పెద్దగా గిన్నె తీసుకుని.. పాలు, కస్టర్డ్ పొడి, పంచదార వేసుకోవాలి.
- అన్నీ బాగా కలిసేలా బ్లెండ్ చేసుకోవాలి.
- దీన్ని పెద్ద పాన్‌లోకి మార్చుకుని, పాలు మరిగే వరకూ బాగా కలుపుకోవాలి.
- 2-3 నిమిషాల వరకూ మరిగిస్తే చిక్కబడుతుంది.
- చల్లబడే వరకూ ఉంచితే కస్టర్డ్ మిల్క్ రెడీ.
- ఇప్పుడు మరో బౌల్‌లో చల్లబడ్డ కస్టర్డ్ పాలు తీసుకోవాలి.
- ఇందులో నానబెట్టిన సబ్జా, స్ట్రాబెర్రీ జెల్లీ వేసుకోవాలి.
- ఇందులో బాదం, కిస్మిస్, ఖర్జూరం ముక్కలు వేసి, కలుపుకోవాలి.
- కొద్దిగా ఐస్‌క్యూబ్స్ వేసి, కలిపిన మిశ్రమాన్ని గ్లాసుల్లో సర్వ్ చేసుకుని, పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటే దూద్‌కా షర్బత్ రెడీ.
బ్లాక్‌బెర్రీ పైనాపిల్ స్మూతీ
కావాల్సిన పదార్థాలు : యోగర్ట్ - అరకప్పు, అరటిపండు - ఒకటి, పైనాపిల్ ముక్కలు -3/4, కాలిఫోర్నియా బ్లాక్ బెర్రీస్- కప్పు, ఐస్ - కప్పు, తేనె- టీస్పూను, నీళ్లు -1/2 కప్పు, బెర్రీస్ - గార్నిష్ కోసం.
తయారుచేసే విధానం : ముందుగా మిక్సీ జార్‌లో యోగర్ట్ వేసి, బాగా బ్లెండ్ చేసుకోవాలి.
దీనిలో అరటిపండు, పైనాపిల్ ముక్కలు, బ్లాక్ మెర్రీస్ వేసి బ్లెండ్ చేసుకోవాలి.
తర్వాత ఐస్, తేనె వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి పల్చగా బ్లెండ్ చేసుకోవాలి.
అన్ని ముక్కలూ మెత్తగా చిక్కగా జ్యూస్‌లా అయిన తర్వాత, ఓ గ్లాస్ తీసుకుని అందులో పోసుకోవాలి.
దీనిపై పక్కన పెట్టుకున్న బ్లాక్ బెర్రీస్ వేసి గార్నిష్ చేసుకోవాలి.
ఖర్బుజా పుల్లఐస్
కావాల్సిన పదార్థాలు : పండిన మస్క్ మెలన్ లేదా ఖర్బూజా ముక్కలు - 500 గ్రా, పంచదార -కప్పు, కాచి చల్లార్చిన పాలు - కప్పు, దానిమ్మ గింజలు - కప్పు.
తయారుచేసే విధానం : ముందుగా పుల్లఐస్ కోసం పండిన ఖర్బూజా తోలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
జ్యూసర్ జార్ తీసుకుని, కట్ చేసుకున్న ఖర్బూజా ముక్కలు వేయాలి.
ఇందులో అరకప్పు పాలు, అరకప్పు పంచదార కలిపి చక్కగా స్మూత్‌గా అయ్యే వరకూ బ్లెండ్ చేసుకోవాలి.
ఆ రసాన్ని పేపర్ కప్పులో పోయాలి. ఇందులో కొద్దిగా దానిమ్మ గింజలు వేసి, మధ్యలో ఐస్ పుల్లలు పెట్టాలి.
తర్వాత రాత్రంతా (8 నుంచి 10 గంటల వరకూ) డీప్‌లో పెట్టాలి.
తర్వాతి రోజు వాటిని బయటకు తీసి, నిమిషం పాటు నీళ్లలో ఉంచితే మౌల్డ్స్ ఊడిపోతాయి. అంతే రంగు రంగుల ఖర్బూజా పుల్లఐస్ రెడీ.
ఫ్రూట్ ఐస్‌క్రీమ్
కావాల్సిన పదార్థాలు : అరటిపండు - అర కప్పు, బొప్పాయి - అరకప్పు, తెల్లద్రాక్ష - అరకప్పు, ఆపిల్ ముక్కలు - అరకప్పు, చెర్రీపండ్లు - ఐదు, బాదం, జీడిపప్పు - 10, వెనిల్లా ఐస్‌క్రీమ్ - కప్పు, పిస్తా ఐస్‌క్రీమ్ - 2 కప్పులు, స్ట్రాబెర్రీ ఐస్‌క్రీం - 2 కప్పులు, పంచదార - ఒకటిన్నర కప్పు.
తయారుచేసే విధానం : ముందుగా ద్రాక్ష పండ్లను నిలువుగా రెండు ముక్కల్లా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని, పంచదార వేసి, సరిపడా నీళ్లు పోసి బాగా కరిగించాలి.
పళ్ల ముక్కలన్నింటినీ షుగర్ వాటర్‌లో వేసి, అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి.
తరువాత పొడవు గాజుగ్లాసు తీసుకొని పండ్ల ముక్కలను వేసి, అందులోనే వెనిల్లా, పిస్తా, స్టాబెర్రీ ఐస్‌క్రీమ్‌లను ఒకదాని తర్వాత ఒకటి వేయాలి.
చివర్లో కట్ చేసిన బాదం, జీడిపప్పులు వేసి చెర్రీ ఫ్రూట్ పెట్టి, సర్వ్ చేసుకోవాలి.