
చలో విజయవాడను జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఎఐ
ప్రజాశక్తి -నందికొట్కూరు టౌన్
విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఈ నెల 30 వ తేదీన హాలో విద్యార్థి చలో విజయవాడ కార్యక్రమంను జయప్రదం చేయాలని బుదవారం నాడు స్థానిక ఎస్.ఎఫ్.ఐ కార్యాలయం లో చలో విజయవాడ పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు డక్కా కుమార్ విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఏకమై ఉద్యమానికి సిద్ధం కావాలని ఛలో విజయవాడ కార్యక్రమానికి జయప్రదంచాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డక్క కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 26వ తేదీన ఛలో కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తుంటే పోలీసు వారు ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయడం, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా కార్యక్రమాలు చేస్తుంటే విద్యార్థులను విద్యార్థి సంఘ నాయకులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళడం, అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుందనీ ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగిందని వారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయమంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారన్నారు . ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుందని వారు అవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు వెంటనే ఇవ్వాలని , ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని , నాలుగేళ్ల డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలని , జీవో నెంబర్ 75 రద్దుచేసి పీజీ విద్యార్థులందరికీ పథకాల అమలు చేయాలని , రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు .హాస్టళ్ళకు కూడా నాడు నేడు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాని ఊసెత్తలేదని అన్నారు. సన్న బియ్యం మాటే మరిచిపోవడం గమనార్హం . ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో హాస్టళ్ళకు మెస్ బిల్లులు పెంచాలని ఈ నాలుగేళ్ళలో 150రూ. పెంచి చేతులు దులుపుకుందని అన్నారు. వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3వేలకు పెంచాలని, పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకానికి 20రూ. పెంచాలని కోరారు. ఉన్నత విద్యలో జిఓ 77 తీసుకొచ్చి ఎయిడెడ్, ప్రయివేటులో చదువకునే పిజి విద్యార్థులకు పధకాలు అమలు చేయకుండా ఉన్నత విద్యను దూరం చేసారని తెలిపారు. కేంద్రంలో మోడి ప్రభుత్వం తీసుకొని వచ్చిన జాతీయ విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేస్తూ తరగతుల విలీనం, నాలుగేళ్ళ డిగ్రీ లాంటి తిరోగమన విధానలను అమలుకు పూనుకుంటున్నారాన్నారు. విలీనంతో ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గి మూసివేతకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నాలుగేళ్ళ డిగ్రీ వలన విద్యార్థులకు ఒరిగిందేమిలేదని తిరగి పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేసారు. డిగ్రీ, పిజి కామన్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమస్యలు అనేక సందర్భాలలో ప్రభుత్వానికి విన్నవించుకున్న మొద్దునిద్ర పోతుందని ప్రభుత్వ మొద్దునిద్ర వీడేందుకు ఈ నెల 30 వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జశ్వంత్ , ఖాజా , రాజు , వంశీ , తదితరులు పాల్గొన్నారు.